Telugu Global
Telangana

గోషమహల్‌కు ఉపఎన్నిక వస్తుందా?

రాజాసింగ్ ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు వేయాల్సింది అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. ఆయనపై ఉన్న కేసులు, ఇతర ఫిర్యాదుల ఆధారంగా ఆయన అనర్హత వేటు వేస్తారా? లేదా అనే దానిపైనే ఉప ఎన్నిక ఆధారపడి ఉంది.

గోషమహల్‌కు ఉపఎన్నిక వస్తుందా?
X

తెలంగాణలో మరో ఉపఎన్నిక వస్తుందా? మత కల్లోలాలకు కారణమైన గోషమహల్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడే అవకాశం ఉందా అనే చర్చ జరుగుతోంది. ఒక వర్గం మనోభావాలు దెబ్బతినేలా గోషమహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత హైదరాబాద్ నగరంలో మతసామరస్యం దెబ్బతిని, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో ఆయనను బీజేపీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా, ఆ పార్టీ శాసనసభా పక్షనేత పదవి నుంచి తొలగించింది. రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి గురువారం చర్లపల్లి జైలుకు తరలించారు. ఇప్పటికే రాజాసింగ్ వ్యవహార శైలిపై మజ్లిస్ ఎమ్మెల్యే అహ్మద్ పాషా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేశారు. రాజాసింగ్‌పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కూడా కోరుతుంది.

రాజాసింగ్ ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు వేయాల్సింది అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. ఆయనపై ఉన్న కేసులు, ఇతర ఫిర్యాదుల ఆధారంగా ఆయన అనర్హత వేటు వేస్తారా? లేదా అనే దానిపైనే ఉప ఎన్నిక ఆధారపడి ఉంది. ప్రస్తుతం రాజాసింగ్ అనర్హత విషయంపై అందిన ఫిర్యాదును స్పీకర్ ఇంకా పరిశీలించలేదు. త్వరలోనే ఆయన సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఎంఐఎంతో పాటు కాంగ్రెస్ ఆశిస్తోంది. అదే జరిగితే గోషమహల్‌కు ఉప ఎన్నిక ఖాయమనే చర్చ జరుగుతోంది.

ఒక ఎమ్మెల్యేను సభ నుంచి సస్పెండ్ చేయగలరేమో గానీ.. అంత సులభంగా అనర్హుడిగా స్పీకర్ ప్రకటించలేరు. రిప్రజెంటేటీవ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ (ఆర్పీ యాక్ట్) సెక్షన్ 8 ప్రకారం ఏ ప్రజా ప్రతినిధి అయినా తీవ్రమైన నేరాల్లో జైలు శిక్ష అనుభవించాలని కోర్టు తీర్పు చెప్తే.. అదే రోజు నుంచి అనర్హుడు అవుతారు. విడుదల అయిన తర్వాత కూడా వెంటనే ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా వీలుండదు. అయితే రాజా సింగ్ విషయంలో పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులు మాత్రమే ఉన్నాయి. ఆయనపై పీడీ యాక్ట్ నమోదు చేసినా, ఇతర రాజకీయ పార్టీలు స్పీకర్‌కు అనర్హత కోసం లేఖ రాసినా వేటు పడే అవకాశం లేనట్లు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

ఒకవేళ తెలంగాణ స్పీకర్ కనుక రాజాసింగ్‌పై అనర్హత వేటు వేస్తే.. ఆయన కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. తన ఎమ్మెల్యే పదవిపై పడిన అనర్హత వేటును రద్దు చేయమని కోరవచ్చు, అదే సమయంలో ఉపఎన్నిక నిర్వహించకుండా స్టే కూడా తెచ్చుకునే వీలుంది. కాబట్టి గోషమహల్‌కు ఉప ఎన్నిక రావడం అంత సులభమేమీ కాదని తెలుస్తుంది. అయితే, రాజాసింగ్ విషయంలో బీజేపీ తప్ప అన్ని పార్టీలు ఆగ్రహంతో ఉన్నాయి. ప్రశాంత వాతావరణాన్ని చెడగొడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అసెంబ్లీ నుంచి కూడా సస్పెండ్ చేయమని కోరే అవకాశం మాత్రం ఉంది. పార్టీ నుంచి, అసెంబ్లీ నుంచి కూడా సస్పెండ్ అయితే.. రాజా సింగ్ ఇక నియోజకవర్గానికే పరిమితం కావల్సి వస్తుంది. పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలలో కూడా పాల్గొనే అవకాశం ఉండదు. ఇది ఒక రకంగా రాజాసింగ్‌ను ఇబ్బంది పెడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అనర్హత వేటు పడకపోయినా.. సస్పెన్షన్ వల్ల కూడా ప్రజల్లోకి ఒక సందేశం పంపినట్లు ఉంటుందని అంటున్నారు.

First Published:  25 Aug 2022 7:48 PM IST
Next Story