Telugu Global
Telangana

ప్రభుత్వం ఉందా, లేదా.. రైతు వెతలపై కేటీఆర్ ప్రశ్నలు

తెల్లవారుజామున 4 గంటలకు క్యూ లైన్‌లో నిలబడితే.. సాయంత్రం 4 గంటల వరకూ విత్తనాలు దొరికే పరిస్థితి లేదన్నారు.

ప్రభుత్వం ఉందా, లేదా.. రైతు వెతలపై కేటీఆర్ ప్రశ్నలు
X

రాష్ట్రంలో విత్తనాల కోసం రైతులు పడుతున్న ఇబ్బందులపై స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతుల వెతలు చూస్తుంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా.. లేదా అన్న అనుమానం కలుగుతోందంటూ ట్వీట్ చేశారు. రైతు సమస్యలపై పర్యవేక్షించాల్సిన వ్యవసాయ ముఖ్యమంత్రి ఎక్కడున్నారన్న కేటీఆర్.. ముందుచూపు లేని ముఖ్యమంత్రి జాడేదంటూ ప్రశ్నించారు.

ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప.. ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్క లేదా అంటూ ప్రభుత్వ పెద్దలపై మండిపడ్డారు కేటీఆర్. నిన్నటి వరకు ధాన్యం అమ్ముదామంటే కొనేటోడు లేడని, ఇవాళ విత్తనాలు కొందామంటే అమ్మేటోడు లేడంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా పడకేసిందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం ఉంటుందన్నారు. సాగునీళ్లు ఇవ్వడం చేతకాక పంటలు ఎండగొట్టారని.. ఇప్పుడు విత్తనాలు అందించే విజన్ కూడా ప్రభుత్వ పెద్గలకు కరవైందన్నారు.


తెల్లవారుజామున 4 గంటలకు క్యూ లైన్‌లో నిలబడితే.. సాయంత్రం 4 గంటల వరకూ విత్తనాలు దొరికే పరిస్థితి లేదన్నారు. గత పదేళ్ల పాటు రైతుల‌కు పది నిమిషాల్లోనే విత్తనాలు అందాయని, ఇప్పుడు 10 గంటలు పడిగాపులు కాసినా విత్తనాలు అందించట్లేదన్నారు. రంగారెడ్డి నుంచి కామారెడ్డి దాకా రైతులకు ఎందుకీ కష్టాలు.. ఇంకెన్నీ రోజులు ఈ కన్నీళ్లు అంటూ రైతు వెతలపై ప్ర‌భుత్వాన్ని ప్రశ్నించారు కేటీఆర్.

దేశం కడుపునింపే స్థాయికి ఎదిగిన తెలంగాణ.. అన్నదాతకే తిండితిప్పలు లేకుండా చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. బీఆర్ఎస్ పాలనలో పండగలా సాగిన వ్యవసాయాన్ని అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఆగం చేశారని మండిపడ్డారు. ఇప్పటికైనా సరిపడా విత్తనాల స్టాక్ తెప్పించాలని డిమాండ్ చేశారు. బ్లాక్‌ మార్కెట్‌కు కళ్లెం వేయాలన్నారు. కాంగ్రెస్‌ వచ్చింది.. కాటగలిసినం అంటున్న అన్నదాతలను అరిగోస పెట్టొద్దని డిమాండ్ చేశారు.

First Published:  29 May 2024 4:14 AM GMT
Next Story