బీఆర్ఎస్‌కు ఆదరణ పెరుగుతోందా ?
తెలంగాణాలో కేసీఆర్ పరిపాలన, అమలవుతున్న సంక్షేమ పథకాలు చూసిన తర్వాత తామంతా బీఆర్ఎస్ పార్టీని స్వాగతించాలని అనుకుంటున్నట్లు చెప్పారు.
మెల్లిగా బీఆర్ఎస్ కు ఆదరణ పెరుగుతున్నట్లే ఉంది. ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ ను జాతీయపార్టీ బీఆర్ఎస్ గా అధినేత కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. కేసీఆర్ ప్రకటించిన రెండోరోజే తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో బీఆర్ఎస్, కేసీఆర్ కు మద్దతుగా పెద్ద పోస్టర్లు వెలసిన విషయం తెలిసిందే. అమ్మాజీ డబల్ అనే వ్యక్తే బీఆర్ఎస్ తరఫున అమలాపురం ఎంపీ అభ్యర్ధిగా వెలసిన పోస్టర్లు కలకలం రేపాయి.
ఈ విషయాన్ని పక్కన పెడితే తాజాగా మహారాష్ట్రలోని ధర్మాబాద్ ప్రాంతం ప్రజలు కూడా బీఆర్ఎస్ కు జై కొడుతున్నారు. తమకు మహారాష్ట్ర ప్రభుత్వం వల్ల ఎలాంటి ఉపయోగాలు జరగలేదని ధర్మాబాద్ ప్రాంత ప్రజలు, కొందరు లోకల్ ప్రజాప్రతినిధులు చెప్పారు. తెలంగాణాలో కేసీఆర్ పరిపాలన, అమలవుతున్న సంక్షేమ పథకాలు చూసిన తర్వాత తామంతా బీఆర్ఎస్ పార్టీని స్వాగతించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలు మహారాష్ట్ర సరిహద్దులను పంచుకుంటున్నాయి.
కాబట్టి పై జిల్లాల్లోని ప్రజలు రెండురాష్ట్రాల పరిస్ధితులపైనా పూర్తి అవగాహనతో ఉంటారు. ఏ అవసరం వచ్చినా రెండు రాష్ట్రాల మధ్య రెగ్యులర్ గా రాకపోకలు సాగిస్తూనే ఉంటారు. అందుకనే కేసీఆర్ పరిపాలనపై ధర్మాబాద్ ప్రాంతం ప్రజలకు మంచి అవగాహన ఉన్నట్లుంది. ఈ విషయాన్ని గమనించే కేసీఆర్ కూడా పార్టీ విస్తరణ ప్రయత్నాలను మహారాష్ట్ర, కర్నాటక నుండే ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. మహబూబ్ నగర్ జిల్లాకు కర్నాటక సరిహద్దులతో గట్టి సంబంధాలున్నాయి.
నిజాం కాలంలో తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక కలిసే ఉండేది. తర్వాత విడిపోయినా దాని మూలాలు అయితే అలాగే ఉన్నాయట. అందుకనే ఇప్పుడు కేసీఆర్ పై రెండు రాష్ట్రాలపైనే ప్రధానంగా దృష్టిపెట్టారు. దీనికితోడు కర్నాటకలో జేడీఎస్ పార్టీ బీఆర్ఎస్ ను మిత్రపక్షంగా డిసైడ్ ప్రకటించింది. సో ఇప్పుడు రెండు రాష్ట్రాలతో మొదలుపెడితే మెల్లిగా ఏపీలో కూడా బీఆర్ఎస్ జనాల్లోకి వెళ్ళే అవకాశముంది. జాతీయపార్టీగా ఎన్నికల కమిషన్ గుర్తింపు దక్కాలంటే సీట్లే కాదు ఓట్లు కూడా చాలా కీలకమే. అందుకనే కేసీఆర్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లున్నారు.