మునుగోడు ప్రచారంలో కాంగ్రెస్ వెనకబడిందా..?
బీజేపీకి అభ్యర్థి ఖరారయ్యారు, టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించకపోయినా, ఎవరు పోటీ చేసినా గెలుపు తమదే అనే విధంగా ప్రచారంలో దూసుకెళ్తోంది, వలసలతో పార్టీ బలం మరింత పెంచుకుంటోంది. కానీ కాంగ్రెస్ మాత్రం డీలా పడింది.
మునుగోడు కేంద్రంగా ఇప్పటికే కేసీఆర్ సభ పూర్తయింది, బీజేపీ నుంచి అమిత్ షా వచ్చి వెళ్లారు, నడ్డా కూడా ఫస్ట్ రౌండ్ పూర్తి చేశారు. కానీ కాంగ్రెస్ నుంచి మాత్రం పెద్ద తలకాయలేవీ ఏపీకి రాలేదు. ప్రియాంక గాంధీ పర్యటన ఖరారు అనుకుంటే.. ఆమె ఇప్పుడు సోనియా అనారోగ్యం కారణంగా విదేశాలకు వెళ్లారు. ఇక్కడ రాష్ట్ర నాయకత్వం ప్రచారం ప్రారంభిస్తే మరోసారి లుకలుకలు బయటపడేలా ఉన్నాయి. దీంతో సహజంగానే మునుగోడు ప్రచారంలో కాంగ్రెస్ కాస్త వెనకబడింది.
బీజేపీకి అభ్యర్థి ఖరారయ్యారు, టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించకపోయినా, ఎవరు పోటీ చేసినా గెలుపు తమదే అనే విధంగా ప్రచారంలో దూసుకెళ్తోంది, వలసలతో పార్టీ బలం మరింత పెంచుకుంటోంది. కానీ కాంగ్రెస్ మాత్రం డీలా పడింది. నలుగురు ఆశావహుల్లో ఇద్దరిని దాదాపుగా ఫైనల్ చేశారంటున్నారు. అందులో పోటీ చేసే ఆ ఒక్కరు ఎవరో తేలాలంటే మాత్రం అధిష్టానం ఆమోద ముద్రపడాల్సిందే. అప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్థి లేకుండా ప్రచారం చేయాల్సిందే.
అప్పటి హుషారు ఏమైంది..?
రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓ రేంజ్ లో ఆయనపై ఫైరయ్యారు. అద్దంకి దయాకర్ సహా మరికొందరు నేతలు కూడా రాజగోపాల్ రాజీనామాపై ధ్వజమెత్తారు. కానీ ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీలోనే ఉండటం, వీరి విమర్శలన్నీ సోదర ద్వయంపై అన్నట్టుగా ఫోకస్ కావడంతో ఇరుకునపడ్డారు. వెంకట్ రెడ్డి ఫీలవుతున్నాడని, ఇప్పుడసలు రాజగోపాల్ రెడ్డిని కూడా విమర్శించడం మానేశారు.
కేడర్ ఎటువైపు..?
రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరినా, కాంగ్రెస్ కేడర్ చెక్కుచెదరకుండా ఉందని అంటున్నారు. కానీ టీఆర్ఎస్ మాత్రం చోటా నాయకులు, కార్యకర్తలకు గాలమేస్తోంది. ప్రతి రోజూ మునుగోడుకి సంబంధించి టీఆర్ఎస్ లో చేరికలు ఉంటున్నాయి. ఈదశలో మునుగోడులో ప్రజా యాత్రలు, పాదయాత్రలతో కేడర్ ని నిలబెట్టుకోవడం కాంగ్రెస్ ముందున్న తక్షణ కర్తవ్యం. కానీ అంతర్గత కుమ్ములాటలు, అధిష్టానానికి ఉన్న ఇతర సమస్యలతో మునుగోడులో కాంగ్రెస్ అనివార్యంగా వెనకబడినట్టయింది. కనీసం ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చిన తర్వాతయినా మునుగోడులో కాంగ్రెస్ జోష్ పెరుగుతుందేమో చూడాలి.