Telugu Global
Telangana

కాళేశ్వరం ప్రాజెక్టు మూసివేతకు కుట్ర..?

మేడిగడ్డ పిల్లర్లు కుంగిన సమయంలో అధికారులు, నిర్మాణ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు ప్రాజెక్టును పరిశీలించారు. అయితే ఆ సమయంలో కుంగిన పిల్లర్లను రిపేర్ చేసే బాధ్యత నిర్మాణ సంస్థదే అని అధికారులు ప్రకటించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు మూసివేతకు కుట్ర..?
X

గ‌త కేసీఆర్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును.. రేవంత్ సర్కార్‌ మూసివేయబోతుందా..? ఇప్పుడు ఇదే అంశంపై సోషల్‌మీడియాలో బీఆర్ఎస్‌ కార్యకర్తలు అనుమానాలు లేవనెత్తుతున్నారు. ఎన్నికలకు ముందు కుంగిన మేడిగడ్డను బూచిగా చూపెడుతూ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా మూసివేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నారు.

మేడిగడ్డ పిల్లర్లు కుంగిన సమయంలో అధికారులు, నిర్మాణ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు ప్రాజెక్టును పరిశీలించారు. అయితే ఆ సమయంలో కుంగిన పిల్లర్లను రిపేర్ చేసే బాధ్యత నిర్మాణ సంస్థదే అని అధికారులు ప్రకటించారు. నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్ టీ సైతం ఇదే మాట చెప్పింది. శనివారం టైమ్స్‌ ఆఫ్ ఇండియా రాసిన కథనంలోనూ ఇరిగేషన్‌ శాఖ అధికారులు ఇదే విషయాన్ని స్పష్టంచేశారు. కన్‌స్ట్రక్షన్‌ ఏజెన్సీ రిస్టోరేషన్‌కు సంబంధించిన ఖర్చులు భరిస్తుందని చెప్పారు.


అయితే నిర్వహణ ఖర్చు భరించేందుకు ఎల్‌ అండ్ టీ సిద్ధంగా లేదని.. ఈ మేరకు ఓ లేఖను ఈఎన్‌సీకి లేఖ రాసిందని కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి. మళ్లీ ఒప్పందం చేసుకుంటేనే ప్రాజెక్టు విషయంలో ముందుకెళ్తామని, దాదాపు రిపేర్‌కు రూ.600 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉందంటూ లేఖలో ఎల్‌ అండ్ టీ పేర్కొందని పత్రికలు రాసుకొచ్చాయి. కాగా, ఎల్‌ అండ్ టీ రాసిన లేఖను పబ్లిక్‌ డొమైన్‌లో ఎందుకు పెట్టడం లేదని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ సాకుతో ప్రాజెక్టును మూసివేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తున్నారు.

First Published:  17 Dec 2023 10:53 PM IST
Next Story