Telugu Global
Telangana

కెసిఆర్ తో సై అంటే 'సై ' !

తెలంగాణలో అధికారంలోకీ రావడానికి బీజేపీ గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ ను పావుగా ఉపయోగించుకుంటున్నదా అనే అనుమానాలు పొడసూపుతున్నాయి. రాష్ట్రప్రభుత్వంతో ఢీ కొట్టే రీతిలో సాగిస్తున్న ఆమె కార్యక్రమాలు ఇలాంటి అనుమానాలను పెంచుతున్నాయి.

Tamilisai Soundararajan and KCR
X

తెలంగాణ పై భార‌తీయ జ‌న‌తా పార్టీ (బిజెపి) ఎంత ప‌ట్టుద‌ల‌గా ఉందో ఇటీవ‌ల జ‌రుగుతున్న ప‌రిణామాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రం ప‌ట్ల వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై గ‌త యేడాది కాలంగా ముఖ్య‌మంత్రి కెసిఆర్ అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్ల అంశంతో ప్రారంభ‌మైన ఈ యుద్ధం రాను రాను పెరిగిపోతూనే ఉంది. రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కేంద్రం అన్ని ర‌కాలుగా ప్ర‌య‌త్నిస్తోంది. అభివృద్ధి, సంక్షేమం లేద‌ని చూపించేందుకు.. ప్ర‌ధానంగా అప్పుల‌పై ఆంక్ష‌లు విధించింది. దీంతో బ‌డ్జెట్ కేటాయింపుల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతుండ‌డంతో ప్ర‌భుత్వానికి ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి.

ఇక కేంద్రం నియ‌మించిన రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై సౌంద‌ర‌రాజ‌న్ కూడా ప్ర‌భుత్వాన్నిఅప్ర‌దిష్ట పాలు చేసేందుకా అన్న‌ట్టు ఇతోధికంగా త‌న వంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఇప్ప‌టికే గ‌వ‌ర్న‌ర్ తీరుతో ముఖ్య‌మంత్రి కెసిఆర్ స‌హా పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వాధినేత సిఫార్సుల‌ను లెక్క‌చేయ‌క పోవ‌డం నుంచి స‌మాంత‌ర ప్ర‌భుత్వం త‌ర‌హాలో ప్ర‌జా ద‌ర్బారులు నిర్వ‌హించ‌డం, ప్రొటోకాల్ అంశాల‌ను వివాదం చేస్తూన్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆఖ‌రికి కేంద్ర ప్ర‌భుత్వానికి రాష్ట్ర ప్ర‌భుత్వంపై ఫిర్యాదులు చేసే వ‌ర‌కూ వెళ్ళింది ఈ వ్య‌వ‌హారం.

ఇటీవ‌ల రాష్ట్రాన్ని ముంచెత్తిన భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న ప్ర‌జ‌ల క‌ష్ట న‌ష్టాల‌ను తెలుసుకునేందుకు ముఖ్య‌మంత్రి కెసిఆర్ ఆయా ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న అధికారుల‌కు ఆదేశాలిచ్చారు. ఇదే సంద‌ర్భంలో ఆయ‌న‌కు పోటీగానా అన్న‌ట్టు గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై కూడా వ‌ర‌ద ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. వాతావ‌ర‌ణం అనుకూలించ‌క‌పోయినా ఆమె రోడ్డు మార్గం ద్వారా భ‌ద్రాద్రి ప్రాంతంలో ప‌ర్య‌టించారు. ఆమె ఇదే తీరును కొన‌సాగిస్తూ రెండో సారి మ‌హిళా ద‌ర్బార్ నిర్వ‌హించారు. వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను క‌లుసుకున్నారు.

వివాదం చేయ‌డం కోసం కాదు..!

ఈ ద‌ర్బారులో మొత్తం 41 మంది మహిళలు తమ కేసులకు సంబంధించి న్యాయ సహాయం కోరారు. సెంటర్ ఫర్ ప్రాక్టీసింగ్ లా, హైదరాబాద్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సహాయంతో ఉచిత న్యాయ సహాయం అందజేస్తామని గవర్నర్ వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ముగ్గురు నిరుపేద మహిళలకు గవర్నర్ తన విచక్షణా పరమైన సహాయాన్ని అందించారు. త‌మ పరిమితుల మేర‌కు అవసరమైన అన్నివిధాలా సహాయం అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని వారి వెంట తాను ఉన్నాన‌ని డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ వారికి చెప్పారు.

మహిళా దర్బార్‌లో పిటిషనర్లతో జరిగిన ఈ కార్య‌క్ర‌మంలో జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ, ఇతర న్యాయ నిపుణులు పాల్గొన్నారు. నిరుపేద మహిళలకు నిర్మాణాత్మక సహాయం అందించడమే లక్ష్యంగా మహిళా దర్బార్ నిర్వ‌హిస్తున్నాన‌ని, వివాదం సృష్టించడం కోసం కాదని గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై అన్నారు.

"చాలా మంది మహిళల‌కు ఎన్నో స‌మ‌స్య‌లు ఉన్నాయి. మేము పిటిషన్లను క్రమబద్ధీకరించి అవసరమైన వాటిని మేము త్వర‌లోనే పరిష్కా రం కోసం ప్రభుత్వానికి పంపుతాము" అని ఆమె తెలిపారు. అంతకుముందు జూలై 10న జరిగిన మహిళా దర్బార్‌కు 400 మందికి పైగా మహిళలు హాజరయ్యారు. ఇలా గ‌వ‌ర్న‌ర్ ' సై అంటై సై ' అంటూ ఎక్క‌డా త‌గ్గేదే లేద‌న్న‌ట్టు ముందు ముందు ఎటువంటి కార్య‌క్ర‌మాలు తీసుకుంటారోన‌ని విశ్లేష‌కులు అనుమ‌నిస్తున్నారు.

First Published:  21 July 2022 2:54 PM IST
Next Story