కామారెడ్డి బరిలో కేసీఆర్.. నిజమేనా?
ఇప్పటికే మూడుసార్లు కేసీఆర్‌ను కలిసి తన మనోభీష్టాన్ని విన్నవించుకున్నట్టు గోవర్దన్ చెప్పారు. కేసీఆర్ కామారెడ్డి నుంచి బరిలో దిగితే.. తాను సామాన్య కార్యకర్తగా ఆయన వెంట నడుస్తానని స్పష్టం చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి నుంచి ఎన్నికల బరిలో దిగబోతున్నారా..? ఇది నిజమేనా..? ఈ ప్రశ్న ఎందుకు ఉత్పన్నమైందంటే.. స్వయంగా అదే ప్రాంతానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ చేసిన కామెంట్ల వల్ల. ఇంతకీ ఆయనేమన్నారు.. అసలు మతలబేంటి.. అన్నది చూద్దాం.
సీఎం కేసీఆర్ పూర్వీకులు కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం కోనాపూర్ లో నివసించేవారని.. మానేరు డ్యామ్ లో పొలాలు మునిగిన కారణంగా వారు సిద్దిపేట జిల్లా చింతమడకకు వలస వెళ్లారని గంప గోవర్దన్ చెప్పుకొచ్చారు. నిన్న రాజంపేట మండలం ఆరేపల్లిలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఈ విషయం చెప్పిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ తమ ప్రాంతం నుంచి పోటీ చేయాలన్న తన కోరికను వెలిబుచ్చారు.
అలా చెప్పడమే కాదు.. ఇప్పటికే మూడుసార్లు కేసీఆర్‌ను కలిసి తన మనోభీష్టాన్ని విన్నవించుకున్నట్టు గోవర్దన్ చెప్పారు. కేసీఆర్ కామారెడ్డి నుంచి బరిలో దిగితే.. తాను సామాన్య కార్యకర్తగా ఆయన వెంట నడుస్తానని స్పష్టం చేశారు. తనకు ఓటమి భయం లేదని.. షబ్బీర్ అలీ వంటి సీనియర్ నాయకుడిపై 4 సార్లు గెలిచిన చరిత్ర తనదని గుర్తుచేశారు. ఈ విషయంలో ప్రత్యర్థుల విమర్శలు పట్టించుకోబోనని తేల్చి చెప్పారు. తన నియోజకవర్గం నుంచి కేసీఆర్ బరిలోకి దిగాలని మాత్రమే కోరుకుంటున్నట్టు చెప్పారు.
గతంలో సిద్దిపేట నుంచి, తర్వాత గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు కేసీఆర్. మరి గంప గోవర్దన్ మాట విని తన పూర్వీకుల గ్రామం ఉన్న కామారెడ్డి నుంచి బరిలోకి దిగుతారా..? లేదంటే తన ప్రస్తుత ఆస్థానమైన గజ్వేల్ నుంచే పోటీ చేస్తారా..? అన్నది ముందు ముందు చూడాల్సి ఉంది.