ఆ తేడా తెలియని కిషన్ రెడ్డి కేంద్ర మంత్రా..?
ఎన్డీఆర్‌ఎఫ్ కు, ఎస్డీఆర్‌ఎఫ్ కు తేడా తెలియని కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా ఉండటం దురదృష్టకరం అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్ విడుదల చేసిన అదనపు నిధులపై సమాధానం చెప్పాలని తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తే.. ఎస్డీఆర్‌ఎఫ్ గణాంకాలను చెప్పి ప్రజల్ని ఏమార్చే ప్రయత్నం చేశారని విమర్శించారు.
తెలంగాణకు వరద సాయం చేశామంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేయాల్సిందిపోయి కిషన్ రెడ్డి తప్పుడు లెక్కలు చెబుతూ అవమానిస్తున్నారని విమర్శించారు. ఎన్డీఆర్‌ఎఫ్ కు, ఎస్డీఆర్‌ఎఫ్ కు తేడా తెలియని కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా ఉండటం దురదృష్టకరం అని అన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్ విడుదల చేసిన అదనపు నిధులపై సమాధానం చెప్పాలని తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తే.. ఎస్డీఆర్‌ఎఫ్ గణాంకాలను చెప్పి ప్రజల్ని ఏమార్చే ప్రయత్నం చేశారని విమర్శించారు. తెలంగాణ పట్ల కేంద్రం చూపుతున్న వివక్ష నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కిషన్ రెడ్డి నిర్లజ్జగా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు కేటీఆర్.
కిషన్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే..
కేంద్రానికి తెలంగాణ చెల్లించే పన్నుల నుంచి రాజ్యాంగబద్ధమైన పద్ధతుల్లో తిరిగి రాష్ట్రానికి దక్కే మార్గాల్లో ఎస్డీఆర్‌ఎఫ్ ఒకటని, దీనిపై కిషన్ రెడ్డి మాటలు ఆయన అవగాహన లేమికి నిదర్శనమని అన్నారు కేటీఆర్. లోక్ సభలో ఈనెల 19న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ చేసిన ప్రకటనను ఒకసారి కిషన్ రెడ్డి చదవాలని హితవు పలికారు కేటీఆర్. పార్లమెంట్ సాక్షిగా నిత్యానంద రాయ్ చేసిన ప్రకటన అవాస్తవమా? లేక కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి చెప్పిన మాటలు వాస్తవమా..? తేల్చి చెప్పాలన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చైర్మన్ గా ఉన్న హైలెవెల్ కమిటీ ఇచ్చే ఎన్డీఆర్‌ఎఫ్ నిధులు అడిగే ధైర్యంలేక కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలకు అబద్ధాలు చెబుతూ తప్పుదోవ పట్టిస్తున్నారని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై అభాండాలు వేసిన కిషన్‌రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్.
హైదరాబాద్ వరదలప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రూ.3500 కోట్ల సాయం కోరితే కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు కేటీఆర్. తాజా వరదలకు ప్రాథమిక నష్టం రూ.1,400 కోట్లని తేల్చి, ప్రత్యేక ఎన్డీఆర్‌ఎఫ్ నిధులు అందించాలని కోరితే కేవలం బృందాలను పంపించి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ వరదల తర్వాత కేంద్ర ప్రభుత్వం పంపిన బృందం రూపొందించిన నివేదిక ఏమైందో ప్రజలకు వివరించాలన్నారు. కేంద్ర బృందాల పర్యటనలతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని, కేవలం తెలంగాణ ప్రజలను ఏమార్చేందుకే కేంద్రం బృందాలను పంపుతోందని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు నిధులు, తెలంగాణకు మాత్రం బృందాలా అని నిలదీశారు.
కిషన్ రెడ్డికి నిజంగా తెలంగాణపై ప్రేమ ఉంటే అదనపు నిధుల కోసం కృషి చేయాలన్నారు. 2018 నుంచి ఇప్పటిదాకా ఒక్కపైసా అదనంగా అందించని కేంద్ర ప్రభుత్వానిది వివక్షపూరిత వైఖరేనని ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే కేంద్రమంత్రిగా ఉంటూ సొంత రాష్ట్రానికి నయాపైసా సాయం తీసుకురాలేని చేతకాని మంత్రిగా కిషన్ రెడ్డి చరిత్రలో మిగిలిపోతారని చెప్పారు.