Telugu Global
Telangana

తెలంగాణ అప్పులు పెరగడానికి కారణం రాష్ట్రమా? కేంద్రమా ?

కేంద్రం గణాంకాల ప్రకారం, తెలంగాణ ప్రభుత్వం 2022 మార్చి చివరి నాటికి రూ. 2,83,452 కోట్ల రుణాన్ని కలిగి ఉంది. కొత్త రాష్ట్రం ఏర్పడిన సమయంలో జూన్ 2, 2014 నాటికి ఉన్న అప్పు రూ. 75,577 కోట్లు. రూ.2,07,875 కోట్లు రాష్ట్ర ఏర్పాటు తర్వాత తాజాగా తీసుకున్నవి.

తెలంగాణ అప్పులు పెరగడానికి కారణం రాష్ట్రమా? కేంద్రమా ?
X

తెల‍ంగాణ అప్పులపాలయ్యిందని, బీఆరెస్ ప్రభుత్వం తెలంగాణను అప్పులపాలు చేసిందని భారతీయ జనతాపార్టీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో నిజమెంత ? తెలంగాణ ప్రభుత్వం ఈ 8 ఏళ్ళలో రూ.2,07,875 కోట్లు అప్పులు చేసిందన్నది నిజమే కానీ అవి ఎందుకయ్యాయి? అవి దేని కోసం ఖర్చుపెట్టారు? కేంద్రం తెలంగాణ పట్ల చూపిస్తున్న వివక్ష, ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవడం ఈ అప్పులకు కారణం కాదా ? ఒక్క సారి గణాంకాలు చూస్తే నిజమేంటొ అర్దమవుతుంది.

కేంద్రం గణాంకాల ప్రకారం, తెలంగాణ ప్రభుత్వం 2022 మార్చి చివరి నాటికి రూ. 2,83,452 కోట్ల రుణాన్ని కలిగి ఉంది. కొత్త రాష్ట్రం ఏర్పడిన సమయంలో జూన్ 2, 2014 నాటికి ఉన్న అప్పు రూ. 75,577 కోట్లు. రూ.2,07,875 కోట్లు రాష్ట్ర ఏర్పాటు తర్వాత తాజాగా తీసుకున్నవి.

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, మిషన్ భగీరథ, వ్యూహాత్మక రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్, ఇతర అభివృద్ధి కార్యక్రమాల అమలు కోసం రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్ల ద్వారా రూ.1.5 లక్షల కోట్లు అప్పుగా తీసుకుంది ప్రభుత్వం. ఇందులో తెలంగాణ ప్రభుత్వం, దాని ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్‌లు ఒక్క నాబార్డ్ నుండి మొత్తం రూ.19,430.93 కోట్లు పొందాయి. 2014 నుండి 2022 మధ్య కాలంలో వివిధ జాతీయ బ్యాంకులు కార్పొరేషన్లు,ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చిన మొత్తం రూ.1,31,241 కోట్లు.

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ (ఆర్‌ఐడీఎఫ్) కింద నాబార్డు నుంచి రూ.8,873 కోట్లు మంజూరయ్యాయి. అదేవిధంగా, నాబార్డ్ ద్వారా వేర్‌హౌస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (WIF) కింద రాష్ట్ర ప్రభుత్వానికి, దాని కార్పొరేషన్‌లకు, PSEలకు, 364 ప్రాజెక్టులకు రూ. 972.78 కోట్లు మంజూరు అయ్యాయి. పంపిణీ చేయబడిన రుణం రూ. 852.27 కోట్లు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అసిస్టెన్స్ (నిడా) కింద రూ. 14,516.65 కోట్లు మంజూరు అయ్యాయి తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్, తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్‌తో సహా వివిధ ప్రభుత్వ యాజమాన్యంలోని కార్పొరేషన్‌లకు రూ.11,424.66 కోట్లు పంపిణీ చేయబడ్డాయి.

కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ తదితర కార్యక్రమాల్లో కేంద్రం తన వాగ్దానాలను నిలబెట్టుకుని రాష్ట్రాన్ని ఆదుకుంటే దాదాపు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు తీసుకోవాల్సిన అవసరం రాకపోయేది.

రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేయడానికి రూ. 32,652 కోట్లు అప్పుగా తీసుకుంది. ఈ పథకంపై కేంద్రం ప్రశంసలు కూడా కురిపించింది. ఈ పథకం స్పూర్థితో జల్ జీవన్ మిషన్ పేరుతో కేంద్రం కూడా ఓ పథకాన్ని ప్రారంభించింది.

రాష్ట్రంలోని గృహాలకు 100 శాతం కుళాయి నీటిని అందించే ఈ పథకానికి కేంద్రం 19,205 కోట్ల రూపాయల నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినప్పటికీ, ఈ పథకాన్ని ప్రశంసించిన అదే కేంద్రం నిధులు ఇవ్వడానికి మాత్రం ఆమోదించలేదు. రాష్ట్ర ప్రభుత్వం తన స్వంత నిధులతో ఈ పథకాన్ని పూర్తి చేసింది.

మరోవైపు, జల్ జీవన్ మిషన్ కింద తెలంగాణకు కేవలం రూ.188.23 కోట్లు ఇచ్చిన కేంద్రం పార్లమెంటులో మాత్రం రూ.3,981.98 కోట్లు కేటాయించినట్లు ప్రకటించడం ఆశ్చర్యకరం.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏ నీటిపారుదల ప్రాజెక్టుకైనా జాతీయ ప్రాజెక్టు హోదా కల్పిస్తామని హామీ ఇచ్చిన కేంద్రం కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా వెనక్కి తగ్గింది. అందువల్ల, ఈ భారీ బహుళ ప్రయోజన లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని అమలు చేయడానికి దాదాపు రూ. 75,000 కోట్లు రుణాలు తీసుకోవడం మినహా రాష్ట్ర ప్రభుత్వానికి వేరే మార్గం లేకుండా పోయింది.

రాష్ట్రానికి వివిధ శాఖల కింద కేంద్రం రూ.1.25 లక్షల కోట్లు బకాయి పడిందని ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు ఇటీవల ప్రకటించారు. కేంద్రం నిధులను నిలిపివేసినందువల్లే బడ్జెట్ అంచనాల్లో అంతరాలు ఏర్పడతున్నాయని ఆయన‌ అన్నారు.

• తెలంగాణ ప్రభుత్వం పొందిన రుణం – రూ. 2.83 లక్షల కోట్లు (మార్చి 2022)

• జూన్ 2, 2014న రుణం - రూ. 75,577 కోట్లు

• రాష్ట్రం ఏర్పడిన తర్వాత తాజాగా తీసుకున్న రుణాలు – రూ. 2,07,875 కోట్లు. తెలంగాణ ప్రభుత్వానికి నాబార్డ్ రుణాలు – రూ. 19,430.93 కోట్లు

• జాతీయ బ్యాంకుల నుండి తెలంగాణ PSEలు, కార్పొరేషన్లు పొందిన రుణాలు - రూ. 1.31 లక్షల కోట్లు

• మిషన్ భగీరథ అమలుకు తీసుకున్న రుణం – రూ. 32,652 కోట్లు

• మిషన్ భగీరథ కోసం నీతి ఆయోగ్ సిఫార్సు - రూ. 19,205 కోట్లు

• మిషన్ భగీరథకు కేంద్రం సహకారం - నిల్

• కాళేశ్వరం కోసం వివిధ సంస్థల‌ నుండి తీసుకున్న రుణాలు – సుమారు రూ.75,000 కోట్లు.

• కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సి ఉన్న బకాయిలు – రూ. 1.25 లక్షల కోట్లు.

ఈ గణాంకాలు చూస్తే నిజమేంటో అర్దమవుతుంది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అభివృద్ది కార్యక్ర‌మాల కోసం ప్రభుత్వం తీసుకున్న అప్పులు రూ. 2,07,875 కోట్లు కాగా కేంద్రం నుండి తెలంగాణకు రావాల్సిన బకాయిలు రూ. 1.25 లక్షల కోట్లు. అవి కేంద్రం ఇచ్చివుంటే ఆ మేరకు తెలంగాణ ప్రభుత్వ తీసుకునే అప్పులు తగ్గేవి. వాటికి కట్టే వడ్డీల బాధ కూడా ఉండ‌పోయేది. 82, 875 కోట్ల అప్పు మాత్రమే తీసుకుకోవాల్సి వచ్చేది. దాని మేర వడ్డీల బాధ కూడా తగ్గేది. దీన్ని బట్టి తెలంగాణ అప్పులు పెరగడానికి కారణమైంది మోడీ సర్కార్ అని అర్దమవుతోంది. మరి బీజేపీ నేతలు విమర్శించాల్సింది ఎవరిని?

First Published:  15 Feb 2023 3:18 AM GMT
Next Story