Telugu Global
Telangana

బీసీల‌కు రెండేసి టికెట్లు ఇస్తామంటున్న కాంగ్రెస్‌.. జ‌రిగే ముచ్చటేనా?

వాస్త‌వానికి బీఆర్ఎస్ జాబితాలో బీసీల‌కు పెద్ద‌గా ప్రాతినిధ్యం ద‌క్క‌లేదు. అందువ‌ల్ల బీసీల‌కు రెండేసి టికెట్ల‌న్న ఫార్ములా వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగితే కాంగ్రెస్ తామే బీసీల‌కు ప్రాతినిధ్యం ఇస్తున్నామ‌ని చెప్పుకోవ‌చ్చు. కానీ,

బీసీల‌కు రెండేసి టికెట్లు ఇస్తామంటున్న కాంగ్రెస్‌.. జ‌రిగే ముచ్చటేనా?
X

ప్ర‌తి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో రెండు శాస‌న‌స‌భ స్థానాల్లో బీసీల‌కు టికెట్లు కేటాయిస్తామ‌ని టీపీసీసీ బ‌ల్ల‌గుద్ది మరీ చెబుతోంది. అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వాటిని వ‌డ‌పోయ‌డంలో బిజీగా ఉంది. ఆదివారం గాంధీభ‌వ‌న్‌లో జ‌రిగిన స్క్రీనింగ్ క‌మిటీ స‌మావేశంలో క‌మిటీ స‌భ్యులైన సీనియ‌ర్ నేత‌ల‌కు అభ్య‌ర్థుల జాబితా ఇచ్చి అందులో ముగ్గురి పేర్లు టిక్ చేయ‌మ‌ని రేవంత్‌రెడ్డి చెప్పారు. బీసీల‌కు ప్రాతినిధ్యం క‌ల్పించేలా ఒక్కో లోక్‌స‌భ స్థానంలోని అసెంబ్లీ నియోజ‌వ‌క‌ర్గ టికెట్ల ఆశావ‌హుల్లో ఇద్ద‌రు బీసీల‌కు టిక్ పెట్టాల‌ని కోరారు. అయితే ఇప్ప‌టికిప్పుడు ఎలా ఆ ముగ్గురిని ఎంపిక చేయాలంటూ సీనియ‌ర్ నేత రేణుకా చౌద‌రి అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. జానారెడ్డీ మ‌ధ్య‌లోనే బ‌య‌టికి వ‌చ్చేశారు.

అడ్వాంటేజ్ కావాలంటే త్యాగాలు త‌ప్ప‌వా?

వాస్త‌వానికి బీఆర్ఎస్ జాబితాలో బీసీల‌కు పెద్ద‌గా ప్రాతినిధ్యం ద‌క్క‌లేదు. అందువ‌ల్ల బీసీల‌కు రెండేసి టికెట్ల‌న్న ఫార్ములా వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగితే కాంగ్రెస్ తామే బీసీల‌కు ప్రాతినిధ్యం ఇస్తున్నామ‌ని చెప్పుకోవ‌చ్చు. కానీ, ప‌రిస్థితి అందుకు స‌హ‌క‌రించేలా క‌నిపించ‌డం లేదు. ఉదాహ‌ర‌ణ‌కు న‌ల్గొండ లోక్‌స‌భ స్థానాన్ని తీసుకుంటే అక్క‌డ హుజూర్‌న‌గ‌ర్‌, కోదాడ కోసం ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి దంప‌తులు, మిర్యాల‌గూడ‌, నాగార్జున‌సాగ‌ర్ టికెట్ల కోసం జానారెడ్డి కుమారులు గ‌ట్టిగా ప‌ట్టుబ‌డుతున్నారు. దేవ‌ర‌కొండ ఎస్టీ సీటు. సూర్యాపేట టికెట్ కావాలంటూ దామోద‌ర్‌రెడ్డి, ప‌టేల్ ర‌మేశ్‌రెడ్డి ప‌ట్టుబ‌డుతున్నారు. ఇక ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మిగిలిన ఏకైక అసెంబ్లీ సీటు న‌ల్గొండ‌. త‌న సీటును అవ‌స‌ర‌మైతే బీసీల‌కు ఇస్తాన‌ని నాలుగుసార్లు అక్క‌డి నుంచి ఎమ్మెల్యేగా, ప్ర‌స్తుతం ఎంపీగా గెలిచిన కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ప్ర‌క‌టించాల్సి వ‌చ్చింది. నిజంగా కోమ‌టిరెడ్డి త్యాగం చేస్తారా లేదా అనేది ప‌క్క‌న‌పెడితే అలా త్యాగాలు చేస్తేగానీ బీసీల‌కు టికెట్లివ్వ‌లేరు.

అయితే బీసీల‌కు.. కుదర‌క‌పోతే బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌ట‌!

ఈ ప‌రిస్థితుల్లో బ‌ల‌మైన బీసీ అభ్య‌ర్థులు ద‌క్క‌క‌పోతే బ‌ల‌మైన ఇత‌ర సామాజిక‌వ‌ర్గ అభ్య‌ర్థుల‌నే రంగంలోకి దింపుతామ‌ని రేవంత్ అంటున్నారు. అంటే బీసీల‌కు ఇద్దామ‌నుకున్నాం.. బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌కు ఇద్దామ‌నుకున్నాం అని చెప్పేయ‌డానికి వివ‌ర‌ణ కూడా సిద్ధం చేసుకున్నార‌ని అర్థ‌మవుతోంది. అంటే బీసీల‌కు లోక్‌స‌భ నియోజ‌వ‌క‌ర్గ ప‌రిధిలో రెండు టికెట్లు అన్న‌ది ప‌బ్లిసిటీ స్టంటేనా అన్న కామెంట్లూ మొద‌ల‌వుతున్నాయి.

*

First Published:  4 Sept 2023 8:54 AM GMT
Next Story