Telugu Global
Telangana

తెలంగాణలో కాషాయజెండా ఎగరడం సాధ్యమా..?

తెలంగాణలో అధికారంలోకి రావాలంటే కనీసం 60 సీట్లు గెలవాలి. కానీ 119 స్థానాల్లో అరవై స్థానాలకు బలమైన అభ్యర్థులను నిలబెట్టగల స్థితిలో బీజేపీ లేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 118 స్థానాలకు పోటీ చేసి ఒక సీటు గెలిచింది.

తెలంగాణలో కాషాయజెండా ఎగరడం సాధ్యమా..?
X

తెలంగాణలో అధికారంలోకి రావడం, కాషాయ జెండా ఎగరేయడమే తమ లక్ష్యమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి వరంగల్‌ సభలో అన్నారు. శనివారం వరంగల్‌లో విజయ సంకల్ప సభ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్‌రెడ్డి.. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ని గద్దె దించుతామని, ఈ నేల మీద కాషాయ జెండా ఎగరేసే దిశగా పనిచేస్తామని చెప్పారు. ఆకాంక్ష ఉండగానే సరిపోదు, ఆ దిశగా తగిన నిర్మాణం, వ్యూహం బీజేపీకి ఉన్నట్టు కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే దూకుడుగా వ్యవహరించే బండి సంజయ్‌ స్థానంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి నియామకం పార్టీకి ఎంతవరకు లాభిస్తుందనే సందేహాలు ఆ పార్టీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. బండి సంజయ్‌తో పోల్చుకుంటే కిషన్‌రెడ్డికి పార్టీలో, ప్రజల్లో ఆమోదం ఎక్కువగా ఉందన్నది నిస్సందేహం. ఎందుకంటే.. కిషన్‌రెడ్డి సౌమ్యుడు, స్నేహశీలి. ప్రత్యర్థి పార్టీల నాయకులతో కూడా ఆయనకు మంచి స్నేహసంబంధాలున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖరరెడ్డిలతో, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో కిషన్‌రెడ్డికి మంచి సంబంధాలున్నాయి.

ప్రత్యర్థి పార్టీలతో విధానాలపరంగా విభేదిస్తూ మాట్లాడుతారే తప్ప వ్యక్తిగత నిందలకు పాల్పడింది లేదు. అంతేగాక సంఘ పరివార్‌ హిందూత్వ ఎజెండాతో ఏకీభావం ఉన్నప్పటికీ రాజకీయాల్లో మత ప్రస్తావనలు ఎక్కువగా తీసుకురారు కిషన్‌రెడ్డి. ఆయన నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్రని గమనిస్తే అన్ని వర్గాల వారిని కలుపుకొని వెళ్ళే స్వభావం వుందని అర్థమవుతుంది.

ఇవన్నీ పార్టీ అధ్యక్షునిగా కిషన్‌రెడ్డికి సానుకూల అంశాలు. పార్టీలో అసంతృప్తికి, అసమ్మతికి తావు లేకుండా భిన్న సామాజిక వర్గాలను తనతో పాటు ముందుకు నడిపించగల సామర్థ్యం కిషన్‌రెడ్డికి వుంది. కానీ, ఎన్నికలకు కొద్ది నెలల ముందు తెలంగాణ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్‌రెడ్డి నుంచి అద్భుతాలు ఆశించడం అత్యాశ. ఎందుకంటే.. ఎన్నికలకు ముందు పార్టీని, పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేసుకోడానికే సమయం చాలదు. అంతేగాక అనేక జిల్లాల్లో బలమైన అభ్యర్థులు బీజేపీకి లభించే అవకాశం లేదు.

తెలంగాణలో అధికారంలోకి రావాలంటే కనీసం 60 సీట్లు గెలవాలి. కానీ 119 స్థానాల్లో అరవై స్థానాలకు బలమైన అభ్యర్థులను నిలబెట్టగల స్థితిలో బీజేపీ లేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 118 స్థానాలకు పోటీ చేసి ఒక సీటు గెలిచింది. అప్పుడు సాధించింది కేవలం 6.98 శాతం ఓట్లు మాత్రమే. 2019 లోక్‌సభ ఎన్నికలలో అనూహ్యంగా ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, సికింద్రాబాద్‌ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. అప్పుడు 20 శాతం ఓట్లు సాధించింది. నాటి ఎన్నికలలో 21 అసెంబ్లీ స్థానాల్లో మెజారిటీ ఓట్లు సాధించగా, మరో 22 స్థానాల్లో ఓట్లపరంగా రెండో స్థానంలో నిలిచింది. కనుకనే తెలంగాణలో బీజేపీ బలం పుంజుకునే అవకాశం వుందని ఆ పార్టీ అగ్రనాయకత్వం భావించింది.

ఈ క్రమంలోనే తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పని చేస్తున్నట్టు కనిపించింది. కానీ, పునాది స్థాయిలో బీజేపీ నిర్మాణం బలపడలేదన్నది వాస్తవం. నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో పార్టీకి గెలుపు అవకాశాలు లేవు. మహబూబ్‌నగర్‌లో పేరున్న నాయకులున్నారే తప్ప పార్టీ నిర్మాణం బలహీనం. హైదరాబాద్‌, రంగారెడ్డి, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాల్లో బీజేపీ కొంత నిర్మాణం కలిగివున్నా, గ్రామీణ ఓటర్లను ఆకట్టుకునే స్థితిలో లేదు. నిజానికి తెలంగాణలోని 33 జిల్లాలకు సంబంధించిన బీజేపీ కమిటీల నిర్మాణమే సరిగా లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కాషాయ జెండా ఎగరేస్తామని కిషన్‌రెడ్డి చెప్పడం పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తుందేమో గానీ, వాస్తవంలో అది అంత సులువు కాదంటున్నారు రాజకీయ పరిశీలకులు.

2019 నాటి లోక్‌సభ ఎన్నికల నాటి గణాంకాల ప్రకారం చూసుకున్నా.. ఆనాడు మెజారిటీ సాధించిన 21 స్థానాలని దక్కించుకోవాలి. రెండో స్థానంలో నిలిచిన 22 స్థానాల్లో కొన్నయినా గెలుచుకోగలరా అన్నది చర్చనీయాంశం. అయినా లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు వేరుగా ఉంటాయి. కేసీఆర్‌ కుటుంబ అవినీతి గురించి మాట్లాడుతున్నారే తప్ప కేసీఆర్‌కు మించి అభివృద్ధిపరంగా, సంక్షేమపాలన దిశగా తాము ఏం చేయగలమో బీజేపీ ఇప్పటివరకు చెప్పలేకపోయింది. ఇక ముందైనా చెబుతుందా..? 119 స్థానాలలో కనీసం అరవై స్థానాలలో బలమైన అభ్యర్థులను నిలబెట్టగలదా..? బీజేపీ - బీఆర్‌ఎస్‌ ఒకటే అని కాంగ్రెస్‌ చేస్తున్న ప్రచారాన్ని అధిగమించి ప్రజల విశ్వాసాన్ని అందుకోగలదా..? కొత్త అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కార్యాచరణనే ఈ ప్రశ్నలకు జవాబు చెబుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

First Published:  8 July 2023 11:57 AM GMT
Next Story