ఈటలకు రెండు చోట్ల కష్టమేనా..?
2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 61 వేలకుపైగా ఓట్లు సాధించగా.. 2021 ఉపఎన్నికలో మాత్రం 3 వేల ఓట్లకే పరిమితమైంది.
ఈటల రాజేందర్ ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలా మారారా.. అంటే అవుననే సమాధానమే వస్తోంది. బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్.. హుజూరాబాద్ బైపోల్‌లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్‌తో పాటు గజ్వేల్ నుంచి బరిలో ఉన్నారు. అయితే గజ్వేల్ ఏమో కానీ.. ఈసారి హుజూరాబాద్‌లోనూ ఈటల గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. రెండు నియోజకవర్గాల్లోనూ ఆయన గెలుపు కష్టమేనని ప్రచారం జరుగుతోంది.
గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌పై ఫోకస్ పెట్టలేకపోతున్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్‌గా ఉండటంతో ఆయన మిగతా అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయాల్సిన పరిస్థితి. దీంతో హుజూరాబాద్‌లో ప్రత్యర్థులతో పోలిస్తే ప్రచారంలో ఆయన వెనుకబడిపోయారు. మరోవైపు హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఈ సారి ఎలాగైనా గెలవాలని కాలికి బలపం కట్టుకుని మరీ తిరుగుతున్నారు. ఇక బైపోల్‌లో గెలిచిన తర్వాత ఈటల నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉపఎన్నిక సమయంలో కాంగ్రెస్ బలహీనమైన అభ్యర్థిని నిలబెట్టడంతోనే ఈటల గెలుపు ఈజీ అయింది.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 61 వేలకుపైగా ఓట్లు సాధించగా.. 2021 ఉపఎన్నికలో మాత్రం 3 వేల ఓట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఈటలకు మళ్లడం వల్లే విజయం సాధ్యమైందని పరిశీలకులు చెప్తున్నారు. ఈసారి కాంగ్రెస్ టికెట్‌పై వొడితల ప్రణవ్ బరిలో ఉండడం ఈటలకు మైనస్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. వొడితల ఫ్యామిలీకి హుజూరాబాద్ నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది.
ఇక కరీంనగర్ జిల్లాలోని బీజేపీ లీడర్లు సైతం ఈటల వెంట ప్రచారానికి వెళ్లడం లేదు. కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు, హుజూరాబాద్ నియోజకవర్గానికే చెందిన గంగాడి కృష్ణారెడ్డి ఇప్పటివరకూ ప్రచారంలో పాల్గొనలేదు. ఇక బండి సంజయ్‌తో మొదటి నుంచి ఈటలకు విబేధాలు కొనసాగుతున్నాయి. ఈటల వల్లే బండి సంజయ్ అధ్యక్ష పదవి పోయిందన్న ప్రచారమూ ఉంది.
ఇక గజ్వేల్‌లోనూ ఈటల గెలుపు అంతా సులువు కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే పలు సర్వేల్లో సీఎం కేసీఆరే ముందున్నారు. సామాజికవర్గం ఓట్లు ఈటలకు కలిసొచ్చినప్పటికీ విజయం సాధించే అవకాశాలు తక్కువే అంటున్నాయి సర్వేలు. నియోజకవర్గంలో కేసీఆర్ అభివృద్ధి, ప్రచార బాధ్యతలు మంత్రి హరీష్ రావు తీసుకోవడం కేసీఆర్‌కు కలిసొచ్చే అంశాలని చెప్తున్నారు.