Telugu Global
Telangana

మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌ది అవకాశవాదమేనా?

మహ్మద్‌ అజారుద్దీన్ అనగానే అందరికీ టీమ్ ఇండియా కెప్టెన్ గానే గుర్తొస్తారు.

మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌ది అవకాశవాదమేనా?
X

రాజకీయాల్లో అవకాశవాదం సహజమే. ఎక్కడ అధికారం ఉంటే అక్కడకు మారిపోతుంటారు. పార్టీలు మార్చకుండానే అన్ని పార్టీల సహకారం తీసుకుంటూ.. ఎప్పటికప్పుడు అధికారంలో ఉండాలనే ఆలోచనతో ఉండేవాళ్లు కనపడుతూనే ఉంటారు. అయితే వీళ్లలో సెలబ్రెటీలు ఉంటే మాత్రం జనాలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. అలాంటి వ్యక్తుల్లో కాంగ్రెస్ జూబ్లీహిల్స్ అభ్యర్థి అజారుద్దీన్ ఒకరు.

మహ్మద్ అజారుద్దీన్ అనగానే అందరికీ టీమ్ ఇండియా కెప్టెన్ గానే గుర్తొస్తారు. కపిల్ దేవ్ తర్వాత టీమ్ ఇండియాను సక్సెస్‌ఫుల్‌గా నడిపించిన క్రికెటర్ అతను. వరల్డ్ కప్ వంటి టైటిల్స్ నెగ్గకపోయినా.. విజయాల పరంగా భారత జట్టును ముందుంచిన కెప్టెన్‌గా అందరికీ గుర్తు. అదే సమయంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో క్రికెట్ ఆట నుంచే కాకుండా, అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా నిషేధాన్ని ఎదుర్కున్నారు. కనీసం బీసీసీఐలో చేరే అవకాశం కూడా లేకపోవడంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

2009లో కాంగ్రెస్ పార్టీలో చేరిన మహ్మద్ అజారుద్దీన్.. తన సొంత ఊరైన హైదరాబాద్‌ను వదిలేసి యూపీలోని మొరాదాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. వాస్తవానికి అప్పట్లో క్రికెట్ అవినీతిపరుడిగా మీడియాలో వార్తలు వచ్చినా.. కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చింది. సొంత ఊరైన హైదరాబాద్‌లో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్నా.. క్రికెట్ అవినీతి బ్యాక్‌ఫైర్ అవుతుందని అజారుద్దీన్ యూపీలోని మొరాదాబాద్‌ను ఎంచుకున్నట్లు వార్తలు వచ్చాయి. మొత్తానికి యూపీ నుంచి అజార్ ఎంపీగా గెలిచారు.

2019 పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబా‌ద్ నుంచి టికెట్ ఆశించి భంగపడిన తర్వాత.. ఆయన చూపు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌పై పడింది. అప్పటికే అజార్‌పై ఉన్న నిషేధం ఎత్తేయడంతో హెచ్‌సీఏ ఎన్నికల్లో నిలబడ్డారు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉండటంతో వారి సహకారం కోరారు. గొప్ప క్రికెటర్, స్థానికుడు కావడంతో అజార్‌కు అప్పట్లో బీఆర్ఎస్ సహకారం అందించింది. అయితే హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన తర్వాత అజారుద్దీన్ అసోసియేషన్‌ను తన గుప్పిట్లో పెట్టుకొని పెత్తనం చెలాయించారు. చివరకు ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌ల టికెట్లు కూడా బ్లాక్‌లో అమ్ముకున్న ఆరోపణలు కూడా రావడంతో బీఆర్ఎస్ దూరం పెట్టింది.

తాజాగా హెచ్‌సీఏ ఎన్నికల సమయంలో ఏకంగా అజారుద్దీన్‌ను ఎలక్షన్స్‌లో పోటీ చేయకుండా కోర్టు నిషేధం విధించింది. అయితే అంతకు ముందే ఈ విషయం తెలిసిన అజార్ మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి ప్రయత్నించారు. ఈ సారి ఉత్తరప్రదేశ్ నుంచి కాకుండా తెలంగాణ నుంచి తన లక్‌ను పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు. బీఆర్ఎస్ తనను దూరం పెట్టిన విషయం తెలుసుకొని మరోసారి కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు.

జీహెచ్ఎంసీ పరిధిలో కీలకమైన జూబ్లీహిల్స్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి ఒక సారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత పోటీ చేసి ఓడిపోయినా నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నారు. స్థానికుడైన నవీన్ యాదవ్ కూడా జూబ్లీహిల్స్ టికెట్ ఆశించారు. వీరిద్దరినీ ఓవర్ టేక్ చేసుకుంటూ తనదైన శైలిలో అజారుద్దీన్ బరిలోకి దిగారు. తనకు ఉన్న పలుకుబడిని ఉపయోగించి అధిష్టానం వద్ద లాబీయింగ్ చేశారు. జూబ్లీహిల్స్‌ పరిధిలోని చిన్నాచితకా నాయకులను మచ్చిక చేసుకొని తన వద్ద బలం ఉందని కాంగ్రెస్ పెద్దల వద్ద చెప్పుకున్నారు.

తెలంగాణ కాంగ్రెస్.. ముఖ్యంగా హైదరాబాద్‌లో పార్టీ ఎదుగుదలకు ఏనాడూ ఒక్క కార్యక్రమం నిర్వహించని అజారుద్దీన్ ఏకంగా జూబ్లీహిల్స్ టికెట్ తెచ్చుకున్నారు. ఢిల్లీ లెవెల్‌లో తనకు ఉన్న పలుకుబడిని ఉపయోగించుకొని.. ఎప్పటి నుంచో టికెట్ ఆశిస్తున్న నాయకులను సైడ్ చేశారు. అందుకే అజారుద్దీన్ ఒక అవకాశవాది అని స్థానిక కాంగ్రెస్ నాయకులు కూడా అంటున్నారు. మొత్తానికి అజార్ చేసిన పనికి కాంగ్రెస్‌లో ఎప్పటి నుంచో ఉంటున్న నాయకులు కూడా బీఆర్ఎస్‌లో జాయిన్ అయ్యారు. ఈ పరిస్థితులు చూసి కాంగ్రెస్ కూడా ఆందోళన చెందుతున్నట్లు పార్టీలో చర్చ జరుగుతున్నది.


First Published:  30 Oct 2023 8:20 PM IST
Next Story