Telugu Global
Telangana

పేలేది సీఎం బామ్మార్ది బాగోతమో? పొంగులేటి బాగోతమో?

దీపావళికి ముందే బాంబులు పేలుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్‌ సెటైర్‌

పేలేది సీఎం బామ్మార్ది బాగోతమో? పొంగులేటి బాగోతమో?
X

దీపావళికి ముందే బాంబులు పేలుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శనాస్త్రాలు సంధించారు. ఆయన ఇంటిపై జరిగిన ఈడీ దాడి గురించి చెబుతారా? లేదా అమృత్‌ స్కామ్‌ గురించి వివరణ ఇస్తారా? ఈడీ దాడుల్లో ఏమైనా దొరికిందేమో? దాని గురించి చెబుతాడు కావొచ్చు. లేక సీఎం బామ్మర్దికి రూ. 11 వేల కాంట్రాక్ట్‌ పై విచారణకు ఆదేశించారేమో అంటూ సెటైర్స్‌ వేశారు. సీఎం బామ్మార్ది బాగోతమో? పొంగులేటి బాగోతమో? కొండల్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌లో దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్లు రాఘవా కన్‌స్ట్రక్షన్స్‌, మెగా ఇంజినీరింగ్‌ ఎట్లా రూ. 4,500కోట్లు పంచుకున్నారో? ఇవన్నీ బైటపెడుతామన్నారు. వాళ్లు ఎన్ని కేసులు పెట్టాలనుకున్నా.. ఇబ్బందిపెట్టినా అంతకంటే ఎక్కువ కొట్లాడుతామన్నారు. సావుకైనా తెగించి కొట్లాడుతామని అంతేగాని ఈ పిచ్చి మాటలకు, తుస్సు బాంబులకు భయపడేవారు ఎవరూ లేరు. ఏం కేసు పెట్టుకుంటారో పెట్టుకోవాలన్నారు. అవినీతిపై ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. పార్టీ ఫిరాయింపులపైనా ఘాటుగానే స్పందించారు. జీవన్‌రెడ్డి పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయంటే ఫిరాయింపులు జరగడం లేదని మంత్రి శ్రీధర్‌ బాబు బుకాయిస్తున్నారు. రేవంత్ రెడ్డి నిన్న మొన్న ఇంటింటికి వెళ్లి కాళ్లు మొక్కి కండువాలు కప్పారు. స్పీకర్‌ ఏమో స్పందించడం లేదు. హైకోర్టు చెప్పినా సోయి లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇది రాజకీయ వ్యభిచారమన్నారు. నాడు రేవంత్‌ రెడ్డి ఏమన్నారు పార్టీ మారిన వాళ్లను రాళ్లతో కొట్టాలన్నారు. ఇవాళ ఎవరిని కొట్టాలి? సీఎంనా? లేదా పార్టీ మారిన వాళ్లనా? అని ప్రశ్నించారు.

First Published:  25 Oct 2024 2:15 PM IST
Next Story