Telugu Global
Telangana

మంత్రి కేటీఆర్ కి బెర్లిన్ అంతర్జాతీయ సదస్సు ఆహ్వానం

ఈ ఏడాది సెప్టెంబర్‌ 14న జర్మనీలోని బెర్లిన్‌ నగరంలో నిర్వహించే ‘గ్లోబల్‌ ట్రేడ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ పాలసీ అలయెన్స్‌’ (GTIPA) వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనాలని కోరుతూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ని ఆహ్వానించారు.

మంత్రి కేటీఆర్ కి బెర్లిన్ అంతర్జాతీయ సదస్సు ఆహ్వానం
X

ఇటీవల అమెరికాలో జరిగిన ‘వరల్డ్‌ ఎన్విరాన్మెంటల్‌ అండ్‌ వాటర్‌ రిసోర్సెస్‌ కాంగ్రెస్‌-2023’లో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అద్భుతంగా వివరించారు మంత్రి కేటీఆర్. తెలంగాణ నీటి విజయాలను ప్రపంచం గుర్తించేలా ప్రసంగించారు. అలాంటి అంతర్జాతీయ వేదికపై మరోసారి తెలంగాణ ఘనకీర్తిని చాటి చెప్పే అవకాశం మంత్రి కేటీఆర్ కి వచ్చింది. ఈసారి పారిశ్రామిక, ఐటీ రంగాల్లో తెలంగాణ కృషిని, విజయాలను వివరించేందుకు మంత్రి కేటీఆర్ కి ఆహ్వానం అందింది. ‘గ్లోబల్‌ ట్రేడ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ పాలసీ అలయెన్స్‌’ (GTIPA) లో పాల్గొనేందుకు కేటీఆర్ కి ఆహ్వానం వచ్చింది.

ఈ ఏడాది సెప్టెంబర్‌ 14న జర్మనీలోని బెర్లిన్‌ నగరంలో నిర్వహించే ‘గ్లోబల్‌ ట్రేడ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ పాలసీ అలయెన్స్‌’ (GTIPA) వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనాలని కోరుతూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ని ఆహ్వానించారు. ‘ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌’ (ITIF) తరపున ఈ ఆహ్వానం అందించారు. అధునాతన సాంకేతిక రంగాలకు సంబంధించి స్వదేశీ, విదేశీ పెట్టుబడుల సాధనలో తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలు, సామాజిక, ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడంలో డిజిటల్‌ టెక్నాలజీ విస్తరణపై ప్రజెంటేషన్‌ ఇవ్వాలని వారు కేటీఆర్ ని కోరారు. ఈమేరకు ITIF ఉపాధ్యక్షుడు స్టీఫెన్ ఎజెల్ మంత్రి కేటీఆర్ కు లేఖ రాశారు.

GTIPA అనే సంస్థ వాణిజ్యం, ప్రపంచీకరణ, నూతన ఆవిష్కరణల ద్వారా కలిగే ప్రయోజనాలకు సంబంధించి స్వతంత్ర నిపుణుల ద్వారా పరిశోధనలు చేయిస్తోంది. ఆర్థిక, వాణిజ్య రంగాల్లో ఎదురవుతున్న నూతన సవాళ్లకు సరైన సృజనాత్మక పరిష్కారాలు కనుగొనడమే ఈ సంస్థ లక్ష్యం. ప్రతి ఏటా నిర్వహించే శిఖరాగ్ర సదస్సుల్లో ప్రాంతీయ ఆవిష్కరణలను ప్రోత్సహిస్తారు. డిజిటల్ సాంకేతికతల వినియోగంపై చర్చిస్తారు. ఈసారి ఈ సదస్సులో పాల్గొనేందుకు మంత్రి కేటీఆర్ ని ఆహ్వానించారు నిర్వాహకులు. వాణిజ్య, ఐటీ, సాంకేతిక రంగంలో తెలంగాణ విజయాలను మంత్రి కేటీఆర్ అక్కడ వివరించే అవకాశం లభించింది. పలు దేశాల ప్రభుత్వాధినేతలు, వ్యాపార, వాణిజ్య, విద్యావేత్తలు ఈ సదస్సులో పాల్గొంటారు.

First Published:  16 July 2023 10:31 AM IST
Next Story