Telugu Global
Telangana

అమృత్‌ టెండర్లలో అక్రమాలపై నిగ్గు తేల్చండి

కేంద్ర పట్టాభివృద్ధి శాఖ మంత్రికి కేటీఆర్‌ లేఖ

అమృత్‌ టెండర్లలో అక్రమాలపై నిగ్గు తేల్చండి
X

అమృత్‌ టెండర్లలో అక్రమాలు జరిగాయని.. సీఎం రేవంత్‌ రెడ్డి బావమరిది, తమ్ముడి కంపెనీలకు అర్హతలు లేకున్నా రూ.వందల కోట్ల విలువైన కాంట్రాక్టులు కట్టబెట్టారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. కేంద్ర పట్టణాభివృద్ధి, హౌసింగ్‌ శాఖ మంత్రి మనోహర్‌ లాల్‌ కట్టర్‌, సహాయ మంత్రి టోచన్‌ సాహూకు శుక్రవారం ఆయన లేఖ రాశారు. ఈ టెండర్లలోని అక్రమాలపై విచారణ చేపట్టి నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్‌ చేశారు. ఈ టెండర్ల వ్యవహారంపై బీఆర్‌ఎస్‌ తో పాటు ఇతర ప్రతిపక్ష నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదన్నారు. కేంద్రం అమృత్‌ పథకంలో భాగంగా తెలంగాణకు కేటాయించిన రూ.1,500 కోట్లల్లో కీలక పనులను ఎలాంటి అనుభవం లేకున్నా సీఎం రేవంత్‌ రెడ్డి బావమరిది, తమ్ముడి కంపెనీలకు కట్టబెట్టారని తెలిపారు. మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ఈ టెండర్ల వివరాలను వెబ్‌సైట్‌ లోనూ పెట్టకుండా అక్రమాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందన్నారు. రేవంత్‌ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేసిన మేఘా ఇంజనీరింగ్‌ కంపెనీకి కొన్ని పనుల అంచనాలను దాదాపు 40 శాతం పెంచి టెండర్లు కట్టబెట్టినట్టు ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమృత్‌ పథకానికి సంబంధించిన సమాచారాన్ని దాచి పెడుతోన్న నేపథ్యంలో కేంద్రం దీనిపై జోక్యం చేసుకోవాలని కోరారు.

సీఎం బావమరిది సృజన్‌ రెడ్డికి చెందిన శోధ కంపెనీ ఇతర కంపెనీలతో కలిసి పలు రాష్ట్రాల్లో అక్రమంగా అనేక ప్రాజెక్టుల టెండర్లు దక్కించుకుంటోందని తెలిపారు. ఆయా పనులను చేసిన అనుభవం కూడా సదరు కంపెనీకి లేదన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌ కు నీళ్లు ఇచ్చే నారాయణపేట్‌ - కొడంగల్‌ లిఫ్ట్‌ స్కీం పనులను మేఘా ఇంజనీరింగ్‌ కంపెనీ, కేఎన్‌ఆర్‌ కంపెనీలకు అప్పగించారని తెలిపారు. కేఎన్‌ఆర్‌ కంపెనీలో సీఎం సోదరుడు తిరుపతి రెడ్డికి వాటాలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొమ్మిది నెలల్లో తెలంగాణ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ లో జరిగిన టెండర్లపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. అమృత్‌ టెండర్లపై బీఆర్‌ఎస్‌ తో పాటు బీఆర్‌ఎస్‌ నాయకులు అనేక ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. ఈ అవినీతి, అక్రమాలపై కేంద్రం స్పందించకుంటే.. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి అవినీతిలో కేంద్రానికి భాగస్వామ్యం ఉందని ప్రజలు నమ్ముతారని హెచ్చరించారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

First Published:  20 Sept 2024 7:10 PM IST
Next Story