Telugu Global
Telangana

కొత్త నీరు, పాత పోరు.. బీజేపీలో గందరగోళం, అయోమయం..

ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొంతమంది కొత్త నాయకులు పార్టీలో చేరారు. వారు వ్యక్తిగత ప్రాధాన్యత కోసం పనిచేస్తున్నారని, పార్టీకోసం పనిచేయడంలేదనేది పాత నాయకుల వాదన. కొత్తవారితో తమకు పొసగడంలేదని చెబుతున్నారు.

కొత్త నీరు, పాత పోరు.. బీజేపీలో గందరగోళం, అయోమయం..
X

తెలంగాణలో బీజేపీ బలపడాలనుకుంటోంది. బలం పెరగాలంటే వలసలు పెరగాలి, అందుకే నయానో భయానో వలస నేతల్ని తెచ్చుకుంటోంది. అయితే ఇక్కడే కొత్త తలనొప్పి మొదలైంది. వలసలతో బలం పెరగకపోగా, సమస్యలు పెరిగాయి. పాత నేతలతో కొత్త నేతలు సరిగా కలవలేకపోవడం, పార్టీని మించి వారు ఎదగాలనుకోవడంతో బీజేపీలో సమస్యలు మొదలయ్యాయి. ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లా సమావేశంలో ఈ వ్యవహారం బయటపడింది. వరంగల్, హన్మకొండ, జనగామ, భూపాల‌పల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల అధ్యక్షులు, కోర్ కమిటీ సభ్యులతో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, తెలంగాణ ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.

ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొంతమంది కొత్త నాయకులు పార్టీలో చేరారు. వారు వ్యక్తిగత ప్రాధాన్యత కోసం పనిచేస్తున్నారని, పార్టీకోసం పనిచేయడంలేదనేది పాత నాయకుల వాదన. కొత్తవారితో తమకు పొసగడంలేదని చెబుతున్నారు. కొత్తగా వ‌చ్చినవారికి ప్రయారిటీ ఇస్తే, ఇన్నాళ్లూ పార్టీనే నమ్ముకుని ఉన్న తమ సంగతేంటని ప్రశ్నించారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా సమావేశం అర్థాంతరంగా ముగిసింది.

నా బాధ ఎవరికి చెప్పుకోవాలి..?

కొత్త నాయకులతో సమస్యలున్నాయని పాత నాయకులు బాధపడుతున్నారు. ఈ బాధ బండి సంజయ్ కి కూడా ఉంది. ఈటల రాజేందర్ ఇటీవల దూకుడు పెంచారు. రాష్ట్ర నాయకత్వాన్ని లైట్ తీసుకుంటూ, అధినాయకత్వానికి దగ్గరవ్వాలని చూస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా చేరికల కమిటీ ఇన్ చార్జ్ గా ఉన్న ఈటల, బండికి తెలియకుండానే కొంతమందిని పార్టీలో చేర్చుకున్నారు. నేర చరిత్ర ఉన్నవారిని ఎలా చేర్చుకుంటారంటూ స్థానిక నేతలు అభ్యంతరం తెలపడంతో ఈ వ్యవహారం రచ్చకెక్కింది. బండి, ఈటల మధ్య ఉన్న వైరం బయపటడింది. పాత నాయకులు, కిషన్ రెడ్డి-బండి సంజయ్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. బీసీ కార్డ్ తో సంజయ్ దూకుడు పెంచారు. ఇప్పుడు అదే బీసీ కార్డ్ తో ఈటల, సంజయ్ కి సమానంగా ప్రాధాన్యం కావాలంటున్నారు. దీంతో బీజేపీలో ముసలం పుట్టినట్టయింది.

కిషన్ రెడ్డి - బండి సంజయ్ - ఈటల రాజేందర్.. ఈ ఎపిసోడ్ అలాగే కింది స్థాయి వరకు కొనసాగుతోంది. ఇద్దరు పాత నేతలు కొట్టుకుంటుంటే, పార్టీలో కొత్తగా వచ్చినవారు తమకి ప్రాధాన్యం కావాలంటూ దాన్ని త్రిముఖ పోరుగా మారుస్తున్నారు. చేరికలతో బలపడతామనుకున్న బీజేపీని ఇప్పుడు అవే చేరికలు భయపెడుతున్నాయి. ఇంటిపోరు తెచ్చిపెట్టాయి.

కన్వీనర్లది మరో సమస్య..

ఈ సమస్యలు చాలదన్నట్టు కన్వీనర్ల నియామకం బీజేపీని ఇబ్బంది పెడుతోంది. నియోజకవర్గానికి కన్వీనర్ గా అవకాశమిస్తామంటే వద్దు పొమ్మంటున్నారు నేతలు. కన్వీనర్ అంటే పార్టీకోసం పనిచేయాలి, కానీ టికెట్ ఆశించకూడదు. ఇదీ అక్కడ రూల్. పార్టీ నియమ నిబంధనల ప్రకారం కన్వీనర్లు ఎన్నికల్లో పోటీ చేయకూడదు. ఆమాత్రం సంబడానికి ఆ పదవులు మాకెందుకు అంటున్నారు నాయకులు. దీంతో కొన్ని నియోజకవర్గాలకు కన్వీనర్లే దొరక్కుండా పోయారు. స్థానికేతరులకు కూడా అవకాశమివ్వాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఇన్ని సమస్యల మధ్య ముగ్గురు ఎమ్మెల్యేల బీజేపీ, ఏడాదిలో అధికారంలోకి వస్తానని ప్రగల్భాలు పలకడం నిజంగా ఆశ్చర్యమే.

First Published:  8 Sept 2022 9:15 AM GMT
Next Story