Telugu Global
Telangana

కడియం, కేకేల ఎగ్జిట్‌.. RSP ఇంట్రెస్టింగ్‌ ట్వీట్‌

సమాజం చాలా వేదనతో వెనకబడి ఉన్నది, వాళ్ల కోసం చట్ట సభల్లో ఒక గొంతుకగా బతికి, వాళ్ల జీవితాలను శక్తి మేరకు సమూలంగా మార్చాలని నేను ప్రజా జీవితంలోకి వచ్చానన్నారు RSP.

కడియం, కేకేల ఎగ్జిట్‌.. RSP ఇంట్రెస్టింగ్‌ ట్వీట్‌
X

ప్రస్తుతం బీఆర్ఎస్‌ను వీడుతున్న నేతలు, తనకు వస్తున్న విజ్ఞప్తులు, హెచ్చరికలపై స్పందించారు బీఆర్ఎస్ నేత RS ప్రవీణ్‌ కుమార్. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా.. తాను మాత్రం బీఆర్ఎస్‌ను వీడేది లేదని స్పష్టం చేశారు. కేకే, కడియం శ్రీహరి అకస్మాత్తుగా బీఆర్ఎస్ పార్టీని వీడడంతో తనకు కొంతమంది ఫోన్‌ చేసి మంచి దారి వెతుక్కోమంటున్నారని, మరికొంత మంది బీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీని వీడొద్దని, ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి అండగా నిలబడాలని కోరుతున్నారని ట్విట్టర్‌ ద్వారా చెప్పుకొచ్చారు.

ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి ఓ సుదీర్ఘమైన ట్వీట్‌ చేశారు ప్రవీణ్ కుమార్. ఇంతకీ ట్వీట్‌లో ఏం చెప్పారంటే.. ప్రియమైన మిత్రులారా.. దయచేసి ఎవరూ టెన్షన్ పడకండి. నేను గొర్రెను కాను. కాలేను. ఇంకెక్కడికో పోవాలన్న ఆలోచన కూడా లేదు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా.. పార్టీని వీడను. నేను గతంలో చేసిన బీయస్పీ- బీఆర్ఎస్ కూటమి ప్రయత్నం కానీ, తర్వాత బీఆర్ఎస్‌లో చేరాలన్న నిర్ణయం కానీ, చాలా ఆలోచించి తీసుకున్నవి. మళ్లీ చెబుతున్న, నేను రాజకీయాల్లోకి వచ్చింది నా స్వంత పిల్లల రాజకీయ భవిష్యత్తు కోసమో, అక్రమ ఆస్తుల కోసమో, పోలీసు కేసులకు భయపడో, హంగులు, ఆర్భాటాలున్న జీవితం కోసమో, ప్రోటోకాల్ కోసమో కాదన్నాకు RSP.

సమాజం చాలా వేదనతో వెనకబడి ఉన్నది, వాళ్ల కోసం చట్ట సభల్లో ఒక గొంతుకగా బతికి, వాళ్ల జీవితాలను శక్తి మేరకు సమూలంగా మార్చాలని నేను ప్రజా జీవితంలోకి వచ్చానన్నారు RSP. ఇందులో భాగంగానే బహుజన వాదం, తెలంగాణ వాదం రెండూ కలవాల్సిన చారిత్రాత్మక అవసరం ఉందని నమ్మానన్నారు. తెలంగాణ ఫలాలు అందరికి అందాల్సిన అవసరం ఉందని నమ్మి, రాజీలేని పోరాటం నడిపి ప్రత్యేక రాష్ట్రం సాధించి, కొత్త తెలంగాణకు బలమైన పునాది వేసిన కేసీఆర్ నాయకత్వంలో నడుస్తున్న బీఆర్ఎస్ పార్టీని వేదికగా ఎంచుకున్నానని స్పష్టం చేశారు.

గెలుపుతో వచ్చే అధికార ఫలాలను అనుభవించినప్పుడు, ఓటమితో వచ్చే కష్టాలను కూడా భరించగలిగే వాడే నిజమైన పార్టీ నాయకుడన్నారు ప్రవీణ్‌కుమార్. ప్రతి దానికి భయపడే పిరికిపందలకు బీఆర్ఎస్ లాంటి ఉద్యమ పార్టీల్లో స్థానం ఉండకూడదన్నారు. దేశంలోనూ.. రాష్ట్రంలోనూ.. అధికార పార్టీలు పోలీసు కేసులను, కట్టు కథలను, ఆయుధాలుగా వాడి రాజకీయ ప్రత్యర్థులను నామరూపాలు లేకుండా చేయడం ఈ తరం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాల్ అన్నారు.

First Published:  30 March 2024 2:59 AM GMT
Next Story