తెలంగాణ మంత్రుల్లో టాప్-3 ఎవరంటే..?
ఇది ఊహాజనితమైనది కాదు, సెల్ఫ్ అనాలసిస్ అంతకంటే కాదు. పక్కాగా ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబించేలా ఈ సర్వే జరిగింది.
తెలంగాణ మంత్రుల పనితీరుపై ఆసక్తికర సర్వే ఒకటి జరిగింది. అత్యధిక జనాదరణ కలిగిన ముగ్గురు మంత్రుల లిస్ట్ విడుదలైంది. ఆ ముగ్గురిలో కేటీఆర్ టాప్ ప్లేస్ లో ఉన్నారు. హరీష్ రావు సెకండ్ ప్లేస్ లో, నిరంజన్ రెడ్డి థర్డ్ ప్లేస్ లో ఉన్నారు. సర్వే చేసిన మీడియా సంస్థకు బీఆర్ఎస్ కి ఎలాంటి సంంబంధం లేదు కాబట్టి.. ఇది ఊహాజనితమైనది కాదు, సెల్ఫ్ అనాలసిస్ అంతకంటే కాదు. పక్కాగా ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబించేలా ఈ సర్వే జరిగింది.
కేటీఆర్ ప్రతిభ..
ఐటీ, పెట్టుబడుల శాఖ మంత్రిగా అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించడం, హైదరాబాద్ రూపురేఖలు మార్చడంలో కేటీఆర్ విజయం సాధించారు. అంతే కాదు, తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల మనసుకి మరింత దగ్గరయ్యారాయన. సిరిసిల్ల నియోజకవర్గంలో గత 50 ఏళ్లలో జరగని అభివృద్ధిని మంత్రి కేటీఆర్ కేవలం పదేళ్లలో చేసి చూపించారని అంటున్నారు స్థానిక ప్రజలు. చేనేత కార్మికుల ఆకలి చావులు, ఆత్మహత్యలు అరికట్టడానికి ఆయన కృషి చేశారు. ఓవైపు పెట్టుబడులకోసం అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొంటూనే, మరోవైపు సొంత నియోజకవర్గంలో కూడా ఆయన తరచూ పర్యటిస్తున్నారు.
ఐటీరంగం అభివృద్ధికి ఆయన చేసిన కృషికి రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. పారిశ్రామిక రంగ ప్రగతికోసం ఆయన చొరవ అభినందనీయం. కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి వస్తున్న స్వచ్ఛ అవార్డులే, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా కేటీఆర్ ప్రతిభకు నిదర్శనం అంటున్నారు. హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దటంలో కూడా కేటీఆర్ పాత్ర ఎనలేనిదని ప్రజలు విశ్వసిస్తున్నారు. మంత్రి కేటీఆర్ పనితీరు పట్ల ప్రజలు 99 శాతం సంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రజలకు అందుబాటులో హరీష్ రావు..
ఆర్థిక, వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పనితీరు పట్ల ప్రజలు 97 శాతం సంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా ఆయన పనితీరుకి ప్రశంసలు లభిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులలో మౌలిక వసతులు, సిబ్బంది పనితీరు మెరుగుపరచడంలో ఆయన చేస్తున్న కృషిని ప్రజలు ప్రశంసిస్తున్నారు. మాతాశిశు సంరక్షణ కేంద్రాలు, కంటివెలుగు పథకం నిర్వహణ.. హరీష్ రావు విజయాలు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు హరీష్ రావు సాగునీటి ప్రాజెక్ట్ ల ఏర్పాటుపై చూపిన చొరవ, కృషిని ఇప్పటికీ ప్రజలు మరచిపోలేకపోతున్నారని తెలుస్తోంది. 2004నుంచి సిద్ధిపేటకు ప్రాతినిధ్యం వహిస్తున్న హరీష్ రావు.. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే విషయంలో కూడా మంచి మార్కులు సాధించారు.
నెంబర్-3 నీళ్ల నిరంజన్ రెడ్డి..
సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అలియాస్ నీళ్ల నిరంజన్ రెడ్డి. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న ఆయన.. సాగునీటి విషయంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వాసులకు నీళ్ల నిరంజన్ రెడ్డిగా చిరకాలం గుర్తుండిపోతారు. సాగునీటితో జిల్లాను సస్యశ్యామలం చేయడంలో ఆయన పాత్ర ముఖ్యమైనది. మంత్రి నిరంజన్ రెడ్డి పనితీరుపై 95.5 శాతం మంది ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయినా వనపర్తి నియోజకవర్గాన్ని ఆయన ఏనాడూ వదిలిపెట్టలేదు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడుగా వనపర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధిపథంలో తీసుకెళ్లారు. అందుకే ఆయన 2018లో అక్కడ భారీ మెజార్టీతో గెలిచారు. రైతుబంధు, రైతు బీమా వంటి పథకాల అమలుతో రైతన్నలకు ఆయన మరింత దగ్గరయ్యారు. వ్యవసాయ రంగాన్ని, వ్యవసాయదారుల్ని కేసీఆర్ ఎంతగా అభిమానించి ఆదరిస్తారో.. ఆయన ఆలోచనలనుంచి వచ్చిన పథకాలను నిరంజన్ రెడ్డి అంతే శ్రద్ధగా అమలులో పెడుతున్నారు.