గవర్నర్ గా మహిళలు కూడా ఉంటారా..? తమిళిసైకి ఎదురైన ప్రశ్న..
పరీక్షలు బాగా రాశావా అని పిల్లల్ని అడిగితే.. మూడు గంటలసేపు సెల్ ఫోన్, ఇంటర్నెట్ కి దూరంగా ఉండాల్సి వచ్చిందని వారు సమాధానం చెబుతున్నారని అన్నారు గవర్నర్ తమిళిసై.
సమాజంలో ఇప్పటికీ లింగ వివక్ష ఉందని చెప్పారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. తనకి కూడా పదే పదే ఈ అనుభవం ఎదురవుతోందని అన్నారామె. పుదుచ్చేరి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె ఇటీవల అక్కడ పర్యటించారు. అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థి, గవర్నర్ గా మహిళలు కూడా ఉంటారా అని ఆమెను ప్రశ్నించాడు. దీంతో తాను షాకయ్యాయనని, పిల్లలకు విషయ పరిజ్ఞానం లేకపోవడంతోపాటు, లింగ వివక్షత ఇంకా ఉన్నట్టు తాను గుర్తించానని చెప్పుకొచ్చారు.
3గంటలసేపు ఇంటర్నెట్ కి దూరం..
పరీక్షలు బాగా రాశావా అని పిల్లల్ని అడిగితే.. మూడు గంటలసేపు సెల్ ఫోన్, ఇంటర్నెట్ కి దూరంగా ఉండాల్సి వచ్చిందని వారు సమాధానం చెబుతున్నారని అన్నారు గవర్నర్ తమిళిసై. పరీక్షల కోసం బాగా చదవండి అని చెబితే, క్వశ్చన్ పేపర్స్ ఎక్కడ ప్రింట్ అవుతున్నాయని అడిగే పరిస్థితి వచ్చిందని చెప్పారు. హైదరాబాద్ JNTU స్నాతకోత్సవంలో పాల్గొన్న తమిళిసై.. విద్యార్థులు చదువుపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ఈరోజుల్లో పరీక్షలు రాసినందుకే విద్యార్థులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు చెప్పే పరిస్థితి వచ్చిందన్నారు.
పరిశోధనలకు చిరునామా హైదరాబాద్..
శాస్త్ర సాంకేతిక పరిశోధనలకు చిరునామాగా హైదరాబాద్ మారిందని రాజస్థాన్ సెంట్రల్ యూనివర్శిటీ ఛాన్స్ లర్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ అన్నారు. JNTU గౌరవ డాక్టరేట్ స్వీకరించారాయన. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మైక్రో సెకన్లలో మార్పులు వస్తున్నాయని, వాటికి అనుణంగా విద్యార్థులు పరిశోధనలపై దృష్టి కేంద్రీకరించాలని తెలిపారు. JNTU స్నాతకోత్సవంలో 92,005 మందికి డిగ్రీలు ప్రదానం చేశారు. వీరిలో 149 మంది PHD పట్టాలు పొందడం విశేషం. 46 మంది గోల్డ్ మెడల్స్ సాధించారు.