Telugu Global
Telangana

నన్ను ఇన్వాల్వ్‌ చేయకండి చారిగారు.. కేటీఆర్‌, రాజగోపాల్‌ ఆసక్తికర చర్చ

తనకు హోంమంత్రి కావాలని ఉందని రాజగోపాల్‌ చెప్పారు. రాజగోపాల్‌రెడ్డికి మంత్రి కావాలనే కోరిక ఉండటంలో తప్పులేదు. కానీ, ఆయన కోరిక నెరవేరుతుందా లేదా అనేదే ప్రశ్న.

నన్ను ఇన్వాల్వ్‌ చేయకండి చారిగారు.. కేటీఆర్‌, రాజగోపాల్‌ ఆసక్తికర చర్చ
X

తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో మాజీమంత్రి కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. రాజగోపాల్ రెడ్డిని చూసిన కేటీఆర్.. మీకు మంత్రి పదవి ఎప్పుడు వస్తుంది? అని అడిగారు. మీలాగే మాకూ ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతోందని రాజగోపాల్ రెడ్డి సమాధానం చెప్పారు. ఫ్యామిలీ పాలన కాదు.. మంచిగా పనిచేస్తే కీర్తి ప్రతిష్టలు వస్తాయని కేటీఆర్ బదులిచ్చారు. ఎంపీగా మీ కూతురు కీర్తి పోటీ చేస్తుందా.. సంకీర్త్ పోటీ చేస్తున్నారా? అని కేటీఆర్ అడిగారు. దయచేసి తనను కాంట్రవర్సీలోకి లాగొద్దంటూ రాజగోపాల్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

కేటీఆర్‌ దగ్గరి నుంచి వెళ్లిపోయి మీడియాతో కాసేపు చిట్‌ చాట్ చేశారు రాజగోపాల్‌రెడ్డి. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. తనకు హోంమంత్రి కావాలని ఉందని రాజగోపాల్‌ చెప్పారు. రాజగోపాల్‌రెడ్డికి మంత్రి కావాలనే కోరిక ఉండటంలో తప్పులేదు. కానీ, ఆయన కోరిక నెరవేరుతుందా లేదా అనేదే ప్రశ్న. ఎందుకంటే ఆయనకు మంత్రి పదవి రాకపోవడానికి, వచ్చే అవకాశాలు తక్కువగా ఉండటానికి ఆయన తోడబుట్టిన అన్న వెంకట్‌రెడ్డే కారణం అన్న చర్చ జరుగుతోంది. రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా అందుకు బలాన్నిస్తున్నాయి. మంత్రి పదవి రాకపోవడానికి ఫ్యామిలీ ఎఫెక్టే కారణమని రాజగోపాలే ఒప్పుకున్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ తమ్ముడికి మంత్రి పదవి అంటే రాజకీయంగా కాంగ్రెస్‌కు మైనస్‌ అయ్యే అవకాశాలు లేకపోలేదు. కానీ రాజగోపాల్‌ మాత్రం మంత్రి కావాలని ఉవ్విల్లూరుతున్నారు. తాను కాంగ్రెస్‌లో చేరిందే కేసీఆర్‌ను గద్దె దించడానికి.. మంత్రి పదవిపై అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ ఉందని చెప్పుకొస్తున్నారు.

ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆల్రెడీ మంత్రి పదవిని ఆస్వాధిస్తున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భువనగిరి, నల్గొండ ఎంపీ సీట్లు కూడా తన కుటుంబానికే కేటాయించాలని పట్టుబడుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా మీద కోమటిరెడ్డి బ్రదర్స్‌కు పట్టుంది. ఇక్కడ వీళ్లు సూచించిన అభ్యర్థులకే టిక్కెట్లు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అందుకే ప్రతిసారి తమ అనుచరులకు టిక్కెట్లు ఇప్పించుకోవడంలో వీరు సక్సెస్ అవుతుంటారు. కానీ, ఈసారి మాత్రం అన్నదమ్ముల మధ్యే వార్ నడుస్తోంది. ఎంపీ సీట్లు తమ కుటుంబానికే కావాలని అన్న పట్టుబడుతుంటే.. తమ్ముడు మాత్రం మంత్రి పదవిపై ఆశతో మా కుటుంబానికి పదవులే వద్దంటున్నాడు. ఎంపీ సీట్లు కోమటిరెడ్డి కుటుంబానికి ఇస్తే తనకు వచ్చే మంత్రి పదవి కూడా రాదనే భయంలో ఉన్నాడు రాజగోపాల్‌రెడ్డి. అందుకే భువనగిరి, నల్గొండ పార్లమెంట్‌కు తమ కుటుంబ సభ్యులెవ్వరూ పోటీ చేయకూడదు అని నిర్ణయించుకున్నామంటున్నాడు. ఇలా మంత్రి పదవికోసం రాజగోపాల్‌రెడ్డి అన్నకే వ్యతిరేకంగా వెళ్తున్నారనే చర్చ జరుగుతోంది. రాజగోపాల్‌రెడ్డి బీజేపీలోకి వెళ్లినప్పటి నుంచి సోదరుల మధ్య సత్సంబంధాలు లేవనే చర్చ కూడా ఉంది. ఈ నేపథ్యంలో తమ్ముడి కోసం వెంకట్‌రెడ్డి తగ్గుతాడా? ఎంపీ సీట్లను వదులుకుని తమ్ముడికి మంత్రి పదవి ఇప్పిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.

First Published:  8 Feb 2024 7:00 PM IST
Next Story