Telugu Global
Telangana

నిన్న ఐటీఐలో మార్పులు, నేడు సమీకృత గురుకులాలు

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పనుల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆర్కిటెక్ట్ లు రూపొందించిన నమూనాలు పరిశీలించారు.

నిన్న ఐటీఐలో మార్పులు, నేడు సమీకృత గురుకులాలు
X

తెలంగాణ విద్యా వ్యవస్థపై తనదైన మార్కు చూపించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాకో మెడికల్ కాలేజీ నిర్మించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థపై చెరిగిపోని ముద్రవేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి తన ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇటీవలే ఐటీఐలలో మార్పులు చేస్తూ వాటిని అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లు(ATC)గా మార్చే పని మొదలు పెట్టారు. మల్లేపల్లిలో ATCకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తాజాగా గురుకులాలపై ఆయన దృష్టిపెట్టారు.

సమీకృత గురుకులాలు అనే కాన్సెప్ట్ ని చాన్నాళ్ల క్రితమే ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి ఒక సమీకృత గురుకుల పాఠశాల(ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌)ను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు విడివిడిగా ఉండేవి. వీటన్నిటినీ నియోజకవర్గంలో ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేయాలనేది రేవంత్ రెడ్డి ఆలోచన. ఒకేచోట వారందరికీ నాణ్యమైన విద్య, వసతి సౌకర్యం కల్పించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం అంటున్నారాయన. దీని ద్వారా పోటీతత్వం పెరుగుతుందని, కుల, మత వివక్ష తొలగిపోతుందని చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు.

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాన్సెప్ట్ లో భాగంగా కొడంగల్, మధిర నియోజకవర్గాల్లో ముందుగా ఈ తరహా భవనాలు నిర్మించబోతున్నారు. ఒక్కో ప్రాంగణం కోసం 20 ఎకరాలు సేకరించారు. పనుల పురోగతిపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆర్కిటెక్ట్ లు రూపొందించిన నమూనాలు ఆయన పరిశీలించారు. నాణ్యమైన విద్యా బోధనకు వీలుగా తరగతి గదులతోపాటు, విద్యార్థులకు అన్ని వసతులుండేలా భవనాలు నిర్మించాలని సూచించారు. ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌కు దీటుగా వీటిని నిర్మించాలన్నారు. రాష్ట్రంలో స్థలాలు అందుబాటులో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో వెంటనే ఇంటిగ్రేటెడ్‌ క్యాంపస్‌ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. కొత్త తరహా క్యాంపస్ ల వల్ల ఏమేరకు ప్రయోజనం ఉంటుందో చూడాలి.

First Published:  24 Jun 2024 2:01 AM GMT
Next Story