కామారెడ్డి ఎమ్మెల్యే వినూత్న నిర్ణయం.. గ్రామాల్లో ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు
కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తన నియోజకవర్గంలో ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామాల్లోని సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకోసం తాజాగా నియోజకవర్గంలోని అన్ని ఊర్లలో ఫిర్యాదు పెట్టెలను ఏర్పాటు చేసి ప్రారంభించారు.
కామారెడ్డి నియోజకవర్గంలో రెండు పార్టీలకు ముఖ్యమంత్రి అభ్యర్థులైన కేసీఆర్, రేవంత్ రెడ్డిలను ఓడించి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన నాయకుడు వెంకటరమణారెడ్డి. కామారెడ్డిలో బీజేపీ తరఫున గెలిచేది నేనే అని చెప్పి మరీ విజయం సాధించి చూపించాడు ఆయన. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వెంకటరమణారెడ్డికి గుర్తింపు వచ్చింది.
ఇప్పుడు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తన నియోజకవర్గంలో ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామాల్లోని సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకోసం తాజాగా నియోజకవర్గంలోని అన్ని ఊర్లలో ఫిర్యాదు పెట్టెలను ఏర్పాటు చేసి ప్రారంభించారు.
ప్రజలు తనను నేరుగా కలవాల్సిన అవసరం లేకుండానే సమస్య ఏంటో వివరిస్తూ ఓ పేపర్లో రాసి ఫిర్యాదు పెట్టెలో వేస్తే వాటిని పరిష్కరిస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. వారానికి ఒకసారి ఫిర్యాదు పెట్టెలను తెరిచి వాటిలోని ఫిర్యాదులను చదివి వాటిని పరిష్కరిస్తానని తెలిపారు. వెంకటరమణారెడ్డి తీసుకున్న నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కలెక్టర్లు, ఎస్పీలు సమస్యాత్మక ప్రాంతాల్లో ఇటువంటి ఫిర్యాదు పెట్టెలు పెట్టి సమస్యలు పరిష్కరించేవారు. ఇప్పుడు వెంకట రమణారెడ్డి కూడా అదే పద్ధతిని అనుసరించారు.