Telugu Global
Telangana

తెలంగాణ విద్యార్థులకు అన్యాయం.. జీవో 33పై కేటీఆర్‌ ఫైర్‌

హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఉన్నందున ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చాలా మంది ఇక్కడే విద్యాభ్యాసం చేస్తున్నారని చెప్పారు కేటీఆర్.

తెలంగాణ విద్యార్థులకు అన్యాయం.. జీవో 33పై కేటీఆర్‌ ఫైర్‌
X

రేవంత్ సర్కార్‌ తీసుకొచ్చిన జీవో 33 కారణంగా మెడికల్ సీట్ల విషయంలో తెలంగాణ విద్యార్థులను అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. స్థానికత విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు ప‌లు అనుమానాలకు దారి తీస్తోందన్నారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన.. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు.


జీవో 33 ప్రకారం తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ఇక్కడ చదివిన విద్యార్థులే స్థానికులు అవుతారని ప్రభుత్వం చెబుతోందన్న కేటీఆర్.. ఈ నిర్ణయం ప్రకారం చాలా మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులు తెలంగాణలో లోకల్ అవుతారని అభ్యంతరం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఉన్నందున ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చాలా మంది ఇక్కడే విద్యాభ్యాసం చేస్తున్నారని చెప్పారు కేటీఆర్. కొత్త నిబంధనల ప్రకారం వారంతా లోకల్ అవుతారన్నారు. ఇదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో చదివే మన విద్యార్థులు నాన్ లోకల్ అయ్యే ప్రమాదం ఉందన్నారు.

2023-24 విద్యా సంవత్సరం వరకు ఆరు నుంచి 12 తరగతి వరకు గరిష్టంగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే అదే స్థానికత గుర్తించామని చెప్పారు కేటీఆర్. దాని కారణంగా మన విద్యార్థులు ఇంటర్మీడియేట్‌ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పటికీ.. లోకల్‌గానే పరిగణించబడేవారన్నారు. కాగా, ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న కొత్త నిబంధనల ప్రకారం వేలాది మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులు తెలంగాణలో లోకల్‌ అవుతారని స్పష్టం చేశారు. దీంతో తెలంగాణ విద్యార్థులు మెడిసిన్ సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగకుండా గతంలో అనుసరించిన విధానాన్నే పాటించాలని ప్రభుత్వాన్ని కోరారు కేటీఆర్.

First Published:  6 Aug 2024 8:19 AM GMT
Next Story