Telugu Global
Telangana

జేబుకు భారమైన ఇరానీ చాయ్.. ద్రవ్యోల్బణం దెబ్బకు పెరిగిన ధర

Irani Chai Price Hike in Hyderabad: ఇరానీ చాయ్ అనగానే సెరామిక్ కప్పులు, సాసర్లు గుర్తు వస్తాయి. దో చాయ్.. తీన్ కప్ అంటూ స్నేహితులు షేర్ చేసుకుంటూ.. కేఫ్‌లలో బాతాకానీ కొడుతూ గంటల కొద్దీ గడిపే వాళ్లు ఉన్నారు.

Irani Chai Price hike in Hyderabad
X

జేబుకు భారమైన ఇరానీ చాయ్.. ద్రవ్యోల్బణం దెబ్బకు పెరిగిన ధర

హైదరాబాద్ నగరానికి, ఇరానీ చాయ్‌కు విడదీయరాని బంధం ఉంది. చాలా మంది ఇక్కడ బిర్యానీ ఫేమస్ అంటారు. విశ్వవ్యాప్తంగా దానికి గుర్తింపు కూడా వచ్చింది. కానీ, ఇరానీ చాయ్‌ కూడా బిర్యానీ అంత ఫేమస్. హైదరాబాద్‌లో వందేళ్ల చరిత్ర కలిగిన ఈ చాయ్‌ని ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎంతో మంది పేదవాళ్లు మధ్యాహ్నం ఒక ఇరానీ చాయ్, బన్‌తో కడుపు నింపుకుంటారు. అలాగే ఇరానీ చాయ్‌లో ఉస్మానియా బిస్కెట్ కాంబినేషన్ ఎప్పటికీ నెంబర్ 1. ఇక చాలా మందికి బిర్యానీ తిన్న తర్వాత ఇరానీ చాయ్ తాగడం కూడా అలవాటు.

తక్కువ ధరకే సామాన్యులకు అందుబాటులో ఉండే ఇరానీ చాయ్.. క్రమంగా జేబుకు భారమవుతోంది. ద్రవ్యోల్బణం కారణంగా రేట్లు భారీగా పెరిగాయి. ఇరానీ చాయ్ తయారీలో వాడే పాలు, చాయ్ పత్తా, చక్కెర, ఇతర మసాలా దినుసులు, గ్యాస్ రేట్లు గత కొన్నేళ్లుగా ఆకాశాన్ని అంటుతున్నాయి. నిన్న మొన్నటి వరకు రూ. 10కే లభించిన ఇరానీ చాయ్ ధరను.. కోవిడ్-19 తర్వాత రూ. 15కి పెంచారు. తాజాగా ఈ చాయ్ ధర రూ. 20కి చేరింది. హైదరాబాద్‌లో పురాతనమైన ఇరానీ కేఫ్‌గా పేరున్న గ్రాండ్ హోటల్‌లో ఇప్పుడు ఇరానీ చాయ్ ధర రూ. 20. సికింద్రాబాద్‌లోని గార్డెన్ కేఫ్ ఇప్పటికీ రూ. 15కే చాయ్ అమ్ముతోంది. కానీ రాబోయే రోజుల్లో పెంచక తప్పదని యాజమాన్యం అంటోంది.

ఒకప్పుడు రూ. 10కే చాయ్ దొరికిన ప్లేస్‌ అయిన కల్చరల్ స్పాట్ లామకాన్‌లో ఇప్పుడు ధరను రూ. 15 చేశారు. చార్మినార్ సమీపంలోని నిమ్రత్ కేఫ్ కూడా ధరను పెంచేసింది. పాలు, ఇతర నిత్యావసరాల ధర పెరగడం, ద్రవ్యోల్బణంతో పాటు సిబ్బంది జీతాలు పెంచాల్సి రావడంతో చాయ్ ధరలు పెంచక తప్పలేదని నిమ్రత్ కేఫ్ ఓనర్ మహ్మద్ అస్లాం తెలిపారు. ఇది ఒక చాయ్ మాత్రమే కాదని.. ఎంతో మందికి దీనితో అనుబంధం ఉందని ఆయన అన్నారు. కొన్ని బడా కేఫ్‌లలో భారీ ధరలకు ఇరానీ చాయ్ అమ్ముతున్న విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు.

ఇరానీ చాయ్ అనగానే సెరామిక్ కప్పులు, సాసర్లు గుర్తు వస్తాయి. దో చాయ్.. తీన్ కప్ అంటూ స్నేహితులు షేర్ చేసుకుంటూ.. కేఫ్‌లలో బాతాకానీ కొడుతూ గంటల కొద్దీ గడిపే వాళ్లు ఉన్నారు. అయితే కోవిడ్-19 కారణంగా చాలా కేఫ్‌లు సాంప్రదాయంగా వస్తున్న సెరామిక్ కప్పులను పక్కన పెట్టి ప్లాస్టిక్/పేపర్ కప్పుల బాట పట్టాయి. దీని వల్ల ఖర్చు పెరుగుతుండటంతో అప్పట్లో రూ. 5 వరకు పెంచారు. పేపర్ కప్పుల్లో ఇరానీ చాయ్ తాగుతుంటే ఆ ఫీలింగ్ రావడం లేదని.. కానీ తప్పడం లేదంటూ ఓ చాయ్ ప్రేమికుడు అన్నారు. ఆయన ఎన్నో ఏళ్లుగా గార్డెన్ కేఫ్‌లో రెగ్యులర్ కస్టమర్‌గా ఉన్నారు.

ధరలకు భయపడి కొన్ని కేఫ్‌లు సీటింగ్ కూడా ఎత్తేశాయి. గతంలో మాదిరిగా గంటల తరబడి కూర్చునే బ్యాచులు కూడా తగ్గిపోయాయని ఓ కేఫ్ ఓనర్ చెప్పుకొచ్చారు. ఇటీవల డిమాండ్ ఎక్కువ కావడంతో తిరిగి సెరామిక్ కప్పులు అందుబాటులోకి తెచ్చాము. కానీ సరుకుల ధర కారణంగా రూ. 20 చేయాల్సి వచ్చిందని అన్నారు.

ఇరానీ చాయ్ ఎలా వచ్చింది?

ఇరానీ చాయ్ ఇప్పుడు హైదరాబాద్ సంస్కృతిలో భాగం అయ్యింది. వందేళ్ల క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చిన ఇరానియన్లు చాయ్ దుకాణాలను తెరిచారు. మొదటిగా తెరిచిన కేఫ్ ఏంటో తెలియదు కానీ.. ఆ కాలంలోనే నెలకొల్పిన చాయ్ కేఫ్‌లలో ఇప్పటికీ ఉన్నది అబిడ్స్‌లోని గ్రాండ్ హోటల్. 1935లో ఈ ఇరానీ జాయింట్ నగరంలో వెలిసింది. ఇరాన్ నుంచి చాలా మంది అప్పట్లో పాకిస్తాన్‌లోని కరాచీ, కొంత మంది సముద్ర మార్గంలో ముంబైకి వచ్చారు. అక్కడి నుంచి హైదరబాద్ చేరుకున్నారు.

ఇరానియన్లు హైదరాబాద్‌లో ఉండటానికి అప్పట్లో అనుకూల వాతావరణం ఉండేది. అప్పట్లో హైదరాబాద్-దక్కన్‌ రాష్ట్రాన్ని నిజాం నవాబులు పాలించారు. వాళ్ల అధికార భాషగా ఉర్దూ, పర్షియన్ ఉండేది. ఇరానియన్లు మాట్లాడేది పర్షియన్ కాబట్టి ఇక్కడ వారు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అప్పట్లో భారతీయులకు చాయ్ తాగే అలవాటు పెద్దగా ఉండేది కాదు. కేవలం బ్రిటిషర్లు మాత్రమే రెగ్యులర్‌గా చాయ్ తాగే వారు.

దీంతో హైదరాబాద్ ప్రజలకు చాయ్‌ని అలవాటు చేసి.. దాని వ్యాపారంగా మలిచింది ఇరానియన్లే. వాస్తవానికి ఇరాన్‌లో చేసే చాయ్ పద్దతికీ.. హైదరాబాద్ చాయ్‌కి చాలా వ్యత్యాసం ఉంటుంది. కానీ, ఇరానియన్లు నెలకొల్పిన కేఫ్‌లలో చాయ్ కావడంతో దానిని ఇరానీ చాయ్ అని పిలవడం ప్రారంభంమైంది. రోజంతా సన్నని సెగపై పాలు, చాత్ పత్తాను వేర్వేరుగా బాయిల్ చేస్తూనే ఉంటారు. ఆ తర్వాత సగం పాలు, సగం డికాక్షన్ కలిపి కప్పులో పోసి ఇస్తారు. ఇరానీ కేఫ్‌లు ఒకప్పుడు మేధావులు, విద్యార్థులకు అడ్డాగా ఉండేవి. ఇప్పుడు ఆ సంస్కృతి అంతా తగ్గిపోతూ వస్తోంది. ధర పెరిగినా.. ఇరానీ చాయ్‌కు మాత్రం డిమాండ్ తగ్గేది ఉండదని గ్రాండ్ హోటల్ యాజమాన్యం తెలియజేస్తోంది.

First Published:  9 Dec 2022 3:22 PM IST
Next Story