Telugu Global
Telangana

ఇందిరమ్మ రాజ్యం ఎమర్జెన్సీని తలపిస్తోంది

బీఆర్‌ఎస్‌ నేతలపై పెట్టిన అక్రమ కేసులు వెనక్కి తీసుకోవాలి : ఎమ్మెల్సీ కవిత

ఇందిరమ్మ రాజ్యం ఎమర్జెన్సీని తలపిస్తోంది
X

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చెప్తోన్న ఇందిరమ్మ రాజ్యం ఎమర్జెన్సీని తలపిస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి హరీశ్‌ రావును పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ నాయకులపై అక్రమ కేసులు పెడుతోందన్నారు. అరెస్టు చేసిన నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి బంజారాహిల్స్‌ ఏసీపీకి ఫోన్‌ చేసి అపాయింట్‌మెంట్‌ తీసుకొనే పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాడని, అక్కడ ఏసీపీ లేకపోవడంతోనే సీఐని కంప్లైంట్‌ తీసుకోవాలని కోరాడని తెలిపారు. సీఐ అక్కడి నుంచి వెళ్లిపోతుంటే కౌశిక్‌ రెడ్డి ప్రశ్నించాడని, అందుకే కౌశిక్‌ పై కేసులు పెట్టారని తెలిపారు. ఉదయం అరెస్టు చేసి ఇప్పటి వరకు ఎందుకు రిమాండ్‌ చేయలేదని ప్రశ్నించారు. కౌశిక్‌ రెడ్డిని కలిసేందుకు వెళ్లిన మాజీ మంత్రులు హరీశ్‌ రావు, జగదీశ్‌ రెడ్డి సహా ఇతర నాయకులను అరెస్ట్‌ చేశారని అన్నారు. ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదు తీసుకునే ధైర్యం లేకనే ఈ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందన్నారు. ఈ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు త్వరలోనే వస్తుందన్నారు. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదని.. పోలీస్‌ రాజ్యమని అన్నారు.

First Published:  5 Dec 2024 6:13 PM IST
Next Story