ఇందిర వర్సెస్ కడియం.. ఘన్ పూర్ లో మాటల తూటాలు
కడియం ఫౌండేషన్ ద్వారా తాను పేద విద్యార్థులకు చేయూతనిస్తున్నా. నియోజకవర్గంలోని ఒక్క దళిత కుటుంబానికి కూడా ఇందిర సాయం చేయలేదన్నారు.
స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో నిన్న మొన్నటి వరకు కడియం వర్సెస్ రాజయ్య రాజకీయం నడిచింది. ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య కూడా మాటల తూటాలు ఓ రేంజ్ లో పేలుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి, కాంగ్రెస్ అభ్యర్థి ఇందిరపై ఘాటు విమర్శలు చేశారు.
రేవంత్ రెడ్డి ఓ గజదొంగ అని, స్టేషన్ ఘన్ పూర్ కాంగ్రెస్ అభ్యర్థి ఇందిర, రేవంత్ పై పలు కేసులు ఉన్నాయని చెప్పారు కడియం. తనపై ఒక్క కేసు కూడా లేదని స్పష్టం చేశారు. నియోజక వర్గంలోని మాదిగలపై నిజంగా ప్రేమ ఉంటే ఆస్తులు మొత్తం రాసివ్వాలని ఇందిరకు సవాల్ విసిరారు. ఇందిర తన ఆస్తుల్ని రాసిచ్చిన మరు క్షణమే తాను కూడా ఆస్తులు రాసిచ్చేస్తానన్నారు. 2018 ఎన్నికల్లో రాజయ్య చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయిన ఇందిర, నియోజకవర్గం పైన అవగాహన లేక పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని కడియం మండిపడ్డారు. కడియం ఫౌండేషన్ ద్వారా తాను పేద విద్యార్థులకు చేయూతనిస్తున్నా. నియోజకవర్గంలోని ఒక్క దళిత కుటుంబానికి కూడా ఇందిర సాయం చేయలేదన్నారు. నియోజకవర్గంలో ప్రజలకు ఏనాడూ అందుబాటులో ఉండని ఆమెకు.. ఇక్కడి ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు కడియం శ్రీహరి.
మంచి బట్టలు వేసుకున్నా చూడలేరు..
బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరిపై కాంగ్రెస్ అభ్యర్థి ఇందిర తీవ్ర విమర్శలు చేశారు. దళితులంటే కడియం శ్రీహరికి చిన్నచూపని.. తెల్లబట్టలు వేసుకుంటే మనుషులను కిందికి మీదికి చూస్తారని వ్యాఖ్యానించారు. దళితులకు ఆయన కనీస మర్యాద కూడా ఇవ్వరన్నారు. రేవంత్ రెడ్డి కూడా ఘన్ పూర్ మీటింగ్ లో కడియంపై విమర్శలు ఎక్కుపెట్టారు. బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్య లాంటి వాళ్లు ఆడవాళ్ల విషయంలో మాట్లాడాల్సిన పద్ధతిలో మాట్లాడాలని, గౌరవాన్ని నిలబెట్టుకోవాలని అన్నారు. ఘన్ పూర్ నియోజకవర్గం అభివృద్ధి కోసం కడియం, రాజయ్య చేసిందేమీ లేదన్నారు. కడియం సంగతి రాజయ్య చెప్పారు.. రాజయ్య సంగతి కడియం ఇప్పటికే చెప్పారని.. ఎవరెవరు ఎలాంటివాళ్లో.. వారే బయటపెట్టుకున్నారని ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి.