సికింద్రాబాద్ - విజయవాడ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్?
తొలుత సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్ -బెంగళూరు లేదా ముంబైకి ఈ ట్రైన్ నడపాలని అనుకున్నారు. అయితే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో కేవలం సీటింగ్ సౌకర్యం మాత్రమే ఉంటుంది. దీంతో ప్లాన్ మార్చినట్లు తెలుస్తున్నది.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు త్వరలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇటీవలే తెలంగాణకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను కేటాయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. న్యూ ఇయర్ కానుకగా వచ్చే ఏడాది నుంచి ఈ సూపర్ ఫాస్ట్, లగ్జరీ ఎక్స్‌ప్రెస్‌ను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించినట్లు సమాచారం. అయితే, ఈ ట్రైన్‌ను ఏయే రూట్లలో నడపాలనే విషయంపై రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. సికింద్రాబాద్ నుంచే ఈ ట్రైన్ నడపాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
తొలుత సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్ -బెంగళూరు లేదా ముంబైకి ఈ ట్రైన్ నడపాలని అనుకున్నారు. అయితే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో కేవలం సీటింగ్ సౌకర్యం మాత్రమే ఉంటుంది. దూర ప్రాంతాలకు ఇందులో కూర్చొని ప్రయాణం చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అందుకే దగ్గరి ప్రాంతాలకు ఈ రైలు తిప్పాలని నిర్ణయించారు. సికింద్రాబాద్-పూణే మధ్య ఇప్పటికే శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ నడుస్తోంది. దీంతో సికింద్రాబాద్-విజయవాడ మధ్య దీన్ని నడిపితే అందరికీ సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నారు.
హైదరాబాద్, విజయవాడ మధ్య రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రతీ రోజు ఎంతో మంది ప్రయాణం సాగిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఈ రెండు నగరాల మధ్య ఉద్యోగులతో పాటు వ్యాపారులు కూడా ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి వస్తే కేవలం 4 గంటల్లో హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకునే అవకాశం ఉన్నది. ఖాజీపేట-విజయవాడ మధ్య ఇప్పటికే హైస్పీడ్‌తో రైళ్లు ప్రయాణించేలా ట్రాక్ పటిష్టం జరిగింది. సికింద్రాబాద్-ఖాజీపేట మధ్య త్వరలోనే ట్రాక్‌ను పూర్తి స్థాయిలో పటిష్టం చేయనున్నారు. దీంతో ఈ రెండు నగరాల మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఫుల్ స్పీడ్‌తో నడిచే అవకాశాలు ఉన్నాయి.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్-విజయవాడ మధ్య నడిపితేనే ప్రయోజనకరంగా ఉంటుందని రైల్వే శాఖ భావిస్తున్నది. ప్రయాణికుల రద్దీ ఉండటం వల్ల లాభదాయకంగా కూడా ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య శాతవాహన, ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లు ప్రయాణానికి 6 గంటల సమయం తీసుకుంటున్నాయి. అదే వందే భారత్ అందుబాటులోకి వస్తే కేవలం 4 గంటల్లో చేరుకోవచ్చు. మధ్యలో వరంగల్, ఖమ్మం స్టాప్‌లు ఇస్తే మరింత మంది ప్రయాణికులు ఈ రైలును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి. అందుకే రైల్వే శాఖ ఈ రెండు నగరాలను వందే భారత్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం.