Telugu Global
Telangana

మళ్లీ టీఆర్ఎస్ కే అధికారం.. బీజేపీకి రెండో స్థానం..

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్ల 42 శాతం మంది ప్రజలు సానుకూలంగా ఉన్న ట్టు ఈ సర్వే వెల్లడించింది. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు టీఆర్‌ఎస్‌ కు దరిదాపుల్లో కూడా లేవు. బీజేపీ 28 శా తం, కాంగ్రెస్‌ 23 శాతం ఓట్లు సాధించే అవకాశమున్నట్టు సర్వే ఫలితాలు చెబుతున్నాయి.

మళ్లీ టీఆర్ఎస్ కే అధికారం.. బీజేపీకి రెండో స్థానం..
X

తెలంగాణలో అధికారం మాదేనంటూ కాంగ్రెస్, బీజేపీ ఢంకా బజాయిస్తున్నా.. ఆ రెండు పార్టీలు రెండు, మూడు స్థానాలకే పరిమితం అవుతాయని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అయితే బీజేపీ పరిస్థితి మరీ అంత మెరుగుపడలేదని, కాంగ్రెస్ ని మాత్రం వెనక్కు నెట్టగలదని తేలిపోయింది. టీఆర్ఎస్ మాత్రం వీటికి అందనంత ఎత్తులోనే ఉంటుందట. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు పెడితే ఫలితాలు ఇలా ఉంటాయంటూ.. ఇండియా టీవీ -మ్యాట్రిజ్ సర్వే తెలిపింది. 'దేశ్ కీ ఆవాజ్' పేరుతో ఈ సర్వే చేపట్టారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే అంశంపై ఈ సర్వే జరిగింది.

టీఆర్ఎస్ కి ఢోకా లేదు..

తెలంగాణలో వరుసగా మూడోసారి కూడా టీఆర్ఎస్ దే అధికారం అని 'ఇండియా టీవీ -మ్యాట్రిజ్' సర్వే స్పష్టం చేసింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధిస్తుందని తెలిపింది. సీఎంగా కేసీఆర్‌ కొనసాగాలని తెలంగాణ యువత ముక్తకంఠంతో కోరుకొంటున్నారనేది సర్వే సారాంశం. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్ల 42 శాతం మంది ప్రజలు సానుకూలంగా ఉన్న ట్టు ఈ సర్వే వెల్లడించింది. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు టీఆర్‌ఎస్‌ కు దరిదాపుల్లో కూడా లేవు. బీజేపీ 28 శా తం, కాంగ్రెస్‌ 23 శాతం ఓట్లు సాధించే అవకాశమున్నట్టు సర్వే ఫలితాలు చెబుతున్నాయి.

సీఎం పనితీరు భేష్..

ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ పనితీరు అద్భుతంగా ఉందని సర్వేల్లో పాల్గొన్న 37 శాతం ప్రజలు అభిప్రాయపడ్డారు. మరోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ కావాలని 42 శాతం మంది కోరుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలోని 119 స్థానాల్లో 76కి పైగా సీట్లలో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ఈ సర్వే తేల్చింది. అయితే 2018 ఫలితాల్లో టీఆర్ఎస్ సాధించిన 88 సీట్లకంటే ఇవి తక్కువ కావడం గమనార్హం. కానీ పరిస్థితి టీఆర్ఎస్ కే పూర్తిగా అనుకూలంగా ఉన్నట్టు మాత్రం సర్వే స్పష్టం చేసింది.

కాంగ్రెస్ ప్రభ తగ్గుతున్నట్టేనా..?

తెలంగాణలో కాంగ్రెస్ పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. ఎమ్మెల్యేలు చేజారుతున్నా కూడా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీని ఎలాగోలా పైకి తీసుకు రావాలని చూస్తోంది అధిష్టానం. దానికి తగ్గ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అయితే కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగాలని చూస్తోంది. ఓట్లు, సీట్ల పరంగా బీజేపీకి తెలంగాణలో పెద్ద స్కోప్ లేకపోయినా, ఉప ఎన్నికల్లో వరుస విజయాలు, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీ కాన్ఫిడెన్స్ లెవల్స్ పెంచాయి. తాజా సర్వేలో కూడా బీజేపీ రెండో స్థానంలో నిలుస్తుందని తెలుస్తోంది. అయితే బీజేపీ, కాంగ్రెస్ మధ్య తేడా కేవలం 5శాతం ఓట్లు మాత్రమే కావడం విశేషం.

First Published:  31 July 2022 9:30 AM IST
Next Story