క్రికెట్ మ్యాచ్ ఎఫెక్ట్: హైదరాబాద్ లో 4 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు
ఈ రోజు హైదరాబాద్ లో జరగనున్న క్రికెట్ మ్యాచ్ దృష్ట్యా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఈ రోజు సాయంత్రం 7 గంటలకు జరగనున్న భారత్-ఆస్ట్రేలియా మూడో టీ 20 మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు.
సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఉప్పల్ స్టేడియం వైపు వెళ్ళే అన్ని మార్గాలో ఎటువంటి వాహనాలను అనుమతించరు. వాహనదారులు ప్రత్యామ్నయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఇక మ్యాచ్ చూడటానికి అంబర్‌పేట వైపు నుంచి వచ్చే వీఐపీ వాహనాలు దూరదర్శన్, రామాంతపూర్ మీదుగా వచ్చి స్ట్రీట్ నెంబర్ 8 వద్ద ఎడమ వైపునకు తీసుకొని గేట్ నెంబర్ 1 వద్ద దిగి వాహనాలను పార్కింగ్ ఏ, సీ ల వద్ద నిలపాలి.
తార్నాక మీదుగా వచ్చే వీఐపీ వాహనాలు హబ్సీగూడ, ఎన్జీఆర్ఐ మీదుగా వచ్చి ఏక్ మినార్ వద్ద కుడి వైపునకు తీసుకొని గేట్ నెంబర్ 1 వద్దకు వెళ్ళాలి. అక్కడ వాహనాలను ఏ, సీ ల వద్ద నిలపాలి.
నాగోల్, వరంగల్ హైవే నుంచి వచ్చే వీఐపీ వాహనాలు ఉప్పల్ చౌరస్తా, సర్వే ఆఫ్ ఇండియా మీదుగా వచ్చి ఏక్ మినార్ వద్ద ఎడమ వైపు తీసుకొని గేట్ నెంబర్ 1 వద్దకు చేరుకోవాలని పోలీసులు తెలిపారు.
ఈ మ్యాచ్ సందర్భంగా మెట్రో రైళ్ళు రాత్రి ఒంటి గంట వరకు నడుస్తాయని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. అదే విధంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి నగరంలోని 24 ప్రదేశాల నుంచి ఉప్పల్ స్టేడియానికి బస్సులు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
మెహదీపట్నం,శంషాబాద్ విమానాశ్రయం, ఘట్కేసర్, హయత్ నగర్, ఎన్జీఓ కాలనీ, ఇబ్రహీంపట్నం, ల్యాబ్ క్వార్టర్స్, కోఠి, దిల్‌సుఖ్‌నగర్, అఫ్జల్‌గంజ్, లకిడికాపూల్, బీహెచ్ఈఎల్, జీడిమెట్ల, కేపీహెచ్‌బీ, మేడ్చల్, మియాపూర్, జేబీఎస్, ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్, యూసఫ్‌గూడ, బోయిన్‌పల్లి, చార్మినార్, చంద్రాయణగుట్ట, కొండాపూర్ రూట్ల నుంచి ఉప్పల్ స్టేడియంవైపు బస్సులు నడువనున్నాయి.