ఎండల తీవ్రత.. RTC కీలక నిర్ణయం
పెరిగిన ఎండల తీవ్రతతో TSRTC కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మధ్యాహ్నం సమయంలో బస్సుల సంఖ్యను తగ్గించనున్నట్లు ప్రకటించింది.
తెలంగాణలో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఇవాళ, రేపు మరో రెండు, మూడు డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో పాటు వడగాడ్పుల ముప్పు పొంచి ఉందని స్పష్టం చేసింది. ప్రధానంగా మధ్యాహ్న సమయంలో ఎండల తీవ్రతతో జనం అల్లాడుతున్నారు.
పెరిగిన ఎండల తీవ్రతతో TSRTC కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మధ్యాహ్నం సమయంలో బస్సుల సంఖ్యను తగ్గించనున్నట్లు ప్రకటించింది. కొద్దిరోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.
మధ్యాహ్న 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సిటీ బస్సుల ట్రిప్పులను తగ్గించనున్నారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు అన్ని రూట్లలో బస్సులు యథావిధిగా రాకపోకలు సాగిస్తాయని అధికారులు స్పష్టం చేశారు.