దడపుట్టిస్తున్న ఎండలు.. ఈ జిల్లాలకు 3 రోజులు వార్నింగ్
కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణశాఖ తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైమాటే. పలు మండలాల్లో తీవ్ర వడగాలులు కూడా వీస్తున్నాయి. వచ్చే 3 రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరో 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గురు, శుక్రవారాల్లో పలు జిల్లాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది.
గురువారం కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ జిల్లాలకు 3 రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా.. మన్నార్ గల్ఫ్ నుంచి అంతర్గత తమిళనాడు, రాయలసీమ మీదుగా దక్షిణ తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని వాతావరణశాఖ తెలిపింది.
ఈ ద్రోణి ప్రభావంతో బుధ, గురు, శుక్రవారాల్లో పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని తెలిపింది. మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడ వానలు పడతాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది వాతావరణశాఖ.