మళ్లీ ఐటీ దాడులు.. ఈసారి టార్గెట్ ఎవరంటే.?
మొత్తం 40 బృందాలతో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఒక్క నల్లగొండలోనే 30 బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి.
తెలంగాణలో ఎన్నికల వేళ ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర రావు ఇళ్లు, ఆఫీసుల్లో ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు ఇన్‌కం టాక్స్ అధికారులు. ఎన్నికల కోసం భారీగా డబ్బు దాచినట్లు సమాచారం అందడంతోనే సోదాలు చేస్తున్నట్లు సమాచారం.
మిర్యాలగూడలోని నల్లమోతు భాస్కర రావు ఇంటితో పాటు హైదరబాద్, నల్గొండ, మిర్యాలగూడలో ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. మొత్తం 40 బృందాలతో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఒక్క నల్లగొండలోనే 30 బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. ఆయన అనుచరుడి ఇంటిలోనూ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. నల్లమోతు భాస్కరరావుకి దేశవ్యాప్తంగా వ్యాపారాలున్నాయి. పలు పవర్‌ప్లాంట్లలో భారీగా పెట్టుబడులు పెట్టారు. సోదాలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మూడు రోజుల క్రితం మంత్రి సబిత, ఆమె బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు జరగ్గా.. అంతకుముందు మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటితో పాటు మహేశ్వరం టికెట్ ఆశించిన కాంగ్రెస్ లీడర్ పారిజాత నర్సింహరెడ్డి నివాసాల్లో ఐటీ సోదాలు జరిగాయి.