Telugu Global
Telangana

హైదరాబాద్‌లో ఎడతెరిపి లేని వర్షం.. మేడ్చెల్‌లో నీట మునిగిన 15 హాస్టల్స్

మేడ్చెల్ జిల్లా మైసమ్మగూడలో భారీ వర్షానికి వరద ముంచెత్తడంతో 15 హాస్టల్స్ నీట మునిగాయి. విద్యార్థులు బయటకు వచ్చేందుకు వీలు పడలేదు. దీంతో స్టూడెంట్స్ ఆందోళన చెందారు.

హైదరాబాద్‌లో ఎడతెరిపి లేని వర్షం.. మేడ్చెల్‌లో నీట మునిగిన 15 హాస్టల్స్
X

తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మంగళవారం తెల్లవారుజాము నుంచే భారీ వర్షం మొదలైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వార్షాలకు నగరంలో రోడ్లపైకి నీళ్లు చేరాయి. ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించగా.. ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చాయి. అమీర్‌పేట, టోలీ చౌకి, బాలానగర్ తదితర ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు చేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలు లోతట్టు ప్రాంతాల్లో కూడా భారీగా వరద నీరు చేరింది.

మేడ్చెల్ జిల్లా మైసమ్మగూడలో భారీ వర్షానికి వరద ముంచెత్తడంతో 15 హాస్టల్స్ నీట మునిగాయి. విద్యార్థులు బయటకు వచ్చేందుకు వీలు పడలేదు. దీంతో స్టూడెంట్స్ ఆందోళన చెందారు. హాస్టల్స్ నుంచి కాలేజీలకు వెళ్లడానికి ఇబ్బందులు పడ్డారు. మైసమ్మగూడ ప్రాంతంలోని దాదాపు 30 అపార్ట్‌మెంట్లలోకి నీళ్లు వచ్చి చేరాయి. ఒక్కో అపార్ట్‌మెంట్ ఫస్ట్ ఫ్లోర్ వరకు వరద నీరు వచ్చిందంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మేడ్చెల్ ప్రాంతంలో ఉండే పలు ఇంజనీరింగ్ కాలేజీలకు చెందిన వందలాది మంది విద్యార్థులు ఈ హాస్టల్స్‌లో ఉంటున్నారు. విద్యార్థులు హాస్టల్స్ నుంచి బయటకు రావడానికి ఇబ్బంది ఏర్పడటంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులతో పాటు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీమ్స్ కూడా అక్కడకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. జేసీబీల సహాయంతో అపార్ట్‌మెంట్లలో ఉన్న విద్యార్థులను బయటకు తీసుకొని వచ్చారు.

పోలీసులు, రెవెన్యూ, జీహెచ్ఎంసీ సిబ్బంది అపార్ట్‌మెంట్ల వద్దకు చేరుకున్నారు. వరద నీటిని మళ్లించేందుకు చర్యలు చేపట్టారు. చెరువుకు నీళ్లు వెళ్లే భూముల్లో అపార్ట్‌మెంట్లు నిర్మించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇలాంటి ప్రాంతంలో అపార్ట్‌మెంట్లు నిర్మించినందుకు బిల్డర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రాబోయే మూడు రోజులు కూడా వర్షాలు ఉంటాయనే హెచ్చరికల నేపథ్యంలో.. విద్యార్థులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు.

First Published:  5 Sept 2023 8:19 AM GMT
Next Story