Telugu Global
Telangana

కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవం వాయిదా.. మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటన రద్దు

కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవం వాయిదా పడినా.. కాళోజీ జయంతి వేడుకలు వరంగల్‌లోనే ఘనంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ తెలిపారు.

కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవం వాయిదా.. మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటన రద్దు
X

ప్రజా కవి కాళోజీ రచనలు, సేవలు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక కళాక్షేత్రాన్ని నిర్మించాలని సీఎం కేసీఆర్ రాష్ట్రం ఏర్పడిన కొత్తలోనే నిర్ణయించారు. ఈ మేరకు వరంగల్‌లో ఈ కళాక్షేత్రం నిర్మాణానికి రూ.75 కోట్లు కేటాయించారు. 2015 సెప్టెంబర్ 9న కాళోజీ జయంతి సందర్భంగా ఈ కళాక్షేత్రం పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఇక అప్పటి నుంచి పనులు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో 9న కాళోజీ జయంతి సందర్భంగా ఈ కళాక్షేత్రాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.

మొదట ఈ ప్రాజెక్టును పర్యటక శాఖ ప్రారంభించగా.. గత మూడు నెలలుగా 'కుడా' పనులు చేపట్టింది. పలు కారణాల వల్ల నిర్మాణం ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే ఈ నెల 9న కాళోజీ కళాక్షేత్రాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ కాళోజీ క్షేత్రాన్ని పరిశీలించారు.

భవనం ఇంకా అసంపూర్తిగా ఉండటం, పలు పనులు పెండింగ్‌లో ఉండటంతో ప్రారంభించడం సబబు కాదని రిపోర్టు ఇచ్చారు. పైగా రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా పరిగణలోకి తీసుకొని.. కాళోజీ కళాక్షేత్ర ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, మున్సిపల్ శాఖ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ ఇచ్చిన సమాచారంతో మంత్రి కేటీఆర్ తన వరంగల్ పర్యటనను వాయిదా వేసుకున్నట్లు సమాచారం.

వరంగల్‌లోనే ఉత్సవాలు..

కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవం వాయిదా పడినా.. కాళోజీ జయంతి వేడుకలు వరంగల్‌లోనే ఘనంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలోనే కళాక్షేత్రం ప్రారంభోత్సవంతో పాటు మంత్రి కేటీఆర్ పర్యటన వాయిదా పడిందని చెప్పారు. త్వరలోనే కళాక్షేత్రం ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. కాగా, హన్మకొండలోని హరిత హోటల్‌లో కాళోజీ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అక్కడే కవి, గాయకుడు జయరాజ్‌కు కాళోపీ పురస్కారాన్ని ప్రదానం చేస్తామని స్పష్టం చేశారు.

First Published:  8 Sept 2023 5:51 AM IST
Next Story