Telugu Global
Telangana

వచ్చే పదేళ్లలో మహిళలకు రూ. లక్ష కోట్ల మేర వడ్డీ లేని రుణాలు

వారిని లక్షాధికారులను చేయడమే ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం లక్ష్యమన్న మంత్రులు

వచ్చే పదేళ్లలో మహిళలకు రూ. లక్ష కోట్ల మేర వడ్డీ లేని రుణాలు
X

మంగళవారం సాయంత్రం హనుమకొండ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకొని ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ సభలోసీఎం సహా మంత్రులు హాజరయ్యారు. ఈ సభకు మహిళలు, ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రజలంతా అండగా ఉండాలన్నారు.

అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతున్నాం: భట్టి విక్రమార్క

అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. వచ్చే పదేళ్లలో మహిళలకు రూ. లక్ష కోట్ల మేర వడ్డీ లేని రుణాలిస్తాం. వారిని లక్షాధికారులను చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యం. మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చే కార్యక్రమాలను చేపడుతున్నాం. సోలార్‌ పవర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసే అవకాశం వారికి కల్పిస్తున్నామన్నారు.

కోటి మంది మహిళలను కోటీశ్వరుడు చేయడమే ప్రభుత్వ లక్ష్యం: సీతక్క

మహిళల అభివృద్ధితోనే సమాజం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలను అత్యుత్తమ వ్యాపారం వ్యక్తులుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. మహిళల సంక్షేమంతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని ఈ సత్యాన్ని గమనించే రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి పెద్ద పీట వేస్తున్నదని తెలిపారు. మహిళలు అనేకరంగాల్లో అత్యుత్తమంగా రాణిస్తూ మంచి పేరు తీసుకొస్తున్నారని, సోలార్ పవర్ ప్లాంట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే బాధ్యతలను కూడా మహిళలకు అందిస్తామని తెలిపారు. అదేవిధంగా దాదాపు 100 బస్సులను మహిళలు నిర్వహించుకునేలా అప్పగిస్తామని తెలిపారు. ఒక ఉద్యమంలో మహిళలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని చెప్పారు.

ఆయన స్ఫూర్తి ప్రదాత: జూపల్లి కృష్ణారావు

వరంగల్ లో కాళోజీ కళాక్షేత్రం ప్రారంభంలో తను పాల్గొనడం గొప్ప ఆనందం ఇస్తున్నదని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఆయన గొప్ప స్ఫూర్తి ప్రదాత అని, ఆలోచించి చూపిన బాట అనుసరణీయమని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నదని చెప్పారు. అలాగే ప్రజా సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నదని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ పాలకులు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసి చేతికి చిప్ప అప్పగించారని మండిపడ్డారు. ఒక అబద్ధాన్ని 10 సార్లు చెబితే అది నిజం అవుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలంతా అండగా ఉండాలని విష ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు.

సర్వేలో ప్రజలంతా భాగస్వాములు కావాలి: పొన్నం ప్రభాకర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దేశానికే దిక్సూచిగా నిలుస్తున్న కుల గణన ఇంటింటా సమగ్ర సర్వేలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పేర్కొన్నారు.ప్రజా పాలన ఏడాది పూర్తి చేసుకున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని సూచించారు. కాళోజీ క్షేత్రాన్ని గొప్పగా నిర్మించి ప్రారంభించుకున్నామని, ప్రజా పాలన కింద ఏర్పడిన ప్రభుత్వం మనం మనమంతా అనే విధంగా ఏర్పడిందని పేర్కొన్నారు. ఇందిరమ్మ ను గుర్తు చేసుకుంటూ మహిళలంతా ఉచిత ఆర్టీసీ బస్సు ద్వారా 110 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారని, 3720 కోట్ల మేర డబ్బులు ఆదా అయ్యాయాన్ని తెలిపారు. మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కుల సర్వే లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి.. ఎవరైనా ఇంకా సర్వే లో పాల్గొనని వారు ఉంటే సర్వేలో పాల్గొనేలా చెయ్యాలని కోరారు.

మూసీ పునర్జీవనం అడ్డుకుంటే పుట్టగతులు ఉండవు: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం మూసి నిర్వాసితులకు గొప్ప జీవన విధానం అందించేందుకు గాను మూసీ పునర్జీవనానికి శ్రీకరం చుట్టిందని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మూసి పునర్జీవనాన్ని బీజేపీ, బీఆర్ఎస్ లు అడ్డుకుంటున్నాయని, వారికి పుట్టగతులు ఉండవని మండిపడ్డారు. ప్రజలు అలాగే ఇబ్బందుల మధ్య జీవించాలని బీఆర్ఎస్, బీజేపీ నేతలు అనుకుంటున్నారని ఎవరెన్ని కుట్రలు చేసినా మూసి పునర్జీవనం ఆగిపోదని ఈ విషయంలో ముఖ్యమంత్రి పట్టుదలతో ముందుకు వెళ్తున్నారని పేర్కొన్నారు. ఇది ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న అంశం అని వారికి మెరుగైన జీవన విధానం అందించాలని మూసి పునర్జీవనానికి ప్రభుత్వం నడుం బిగించిందని పేర్కొన్నారు. లేనిపోని కుట్రలు విమర్శలు చేస్తూ మూసి పునర్జీవనాన్ని మాత్రం అడ్డుకుంటే సహించేది లేదని హెచ్చరించారు.

ఎంత ఇబ్బంది ఉన్నా హామీలను నెరవేరుస్తాం: దుద్దిళ్ల శ్రీధర్ బాబు

గత బీఆర్ఎస్ పాలకుల నిర్వాకం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్న ఎన్నికల ముందు తాము ఇచ్చిన హామీలను నెరవేర్చి తీరుతామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. అన్నివర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఇందులో ఎలాంటి అనుమానాలకు తావు లేదని మంత్రి పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలను ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని అమలు చేసి తీరుతామని దీనిపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. గత బీఆర్ఎస్ పాలకులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ప్రజలను మోసగించారని మండిపడ్డారు. వారి నిర్వాకం వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారిందని దీంతో తమ ప్రభుత్వం రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ హామీలను అమలు చేస్తున్నదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన, ఇందిరమ్మ రాజ్యం ఎల్లప్పుడు అండగా ఉంటుందని గుర్తుంచుకోవాలని మంత్రి సూచించారు.

First Published:  19 Nov 2024 9:58 PM IST
Next Story