Telugu Global
Telangana

కమ్యూనిస్టులకు షాక్ తప్పదా?

ఎందుకంటే కమ్యూనిస్టు పార్టీలు పాలేరు, కొత్తగూడెం, హుస్నాబాద్, బెల్లంపల్లి, మునుగోడు, దేవరకొండ, మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గాల కోసం పట్టుబడుతున్నాయి. వీటిల్లో కూడా ముఖ్యంగా కొత్తగూడెం కోసం సీపీఐ, పాలేరు కోసం సీపీఎంలు పట్టుగా ఉన్నాయి.

కమ్యూనిస్టులకు షాక్ తప్పదా?
X

కమ్యూనిస్టు పార్టీలకు ఇక్కడ కూడా షాక్ తప్పేలా లేదు. విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోబోతున్నట్లు సీపీఐ, సీపీఎం అనుకున్నాయి. కేసీఆర్‌ చలవతో నాలుగు సీట్లలో గెలవచ్చని కలలు కన్నాయి. అయితే కమ్యూనిస్టులతో పొత్తు ప్రస్తావనే లేకుండా 115 నియోజకవర్గాల్లో కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించేశారు. దాంతో మండిపోయిన కమ్యూనిస్టు పార్టీలు బీఆర్ఎస్ ఓటమే ధ్యేయమని భీషణ ప్రతిజ్ఞ చేశాయి. అంతేకాకుండా వెంటన కాంగ్రెస్‌తో పొత్తులు చర్చలు మొదలుపెట్టేశాయి.

అయితే ఇక్కడ కూడా పొత్తులు అంత తేలికగా జరిగేట్లు కనబడటంలేదు. ఎందుకంటే కమ్యూనిస్టు పార్టీలు పాలేరు, కొత్తగూడెం, హుస్నాబాద్, బెల్లంపల్లి, మునుగోడు, దేవరకొండ, మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గాల కోసం పట్టుబడుతున్నాయి. వీటిల్లో కూడా ముఖ్యంగా కొత్తగూడెం కోసం సీపీఐ, పాలేరు కోసం సీపీఎంలు పట్టుగా ఉన్నాయి. ఈ రెండు నియోజకవర్గాలపై ఎందుకంత పట్టంటే కొత్తగూడెంలో సీపీఐ సెక్రటరీ కూనంనేని సాంబశివరావు, పాలేరులో సీపీఎం కార్యదర్శి తమ్మేనేని వీరభద్రం పోటీ చేయబోతున్నారు.

అయితే తాజా పరిణామాలను చూస్తే కాంగ్రెస్ ఈ రెండు సీట్లను వదులుకోవటానికి అవకాశంలేదని సమాచారం. ఎందుకంటే మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్‌లో చేర్చుకుంటే పాలేరు టికెట్ ఇవ్వకతప్పదు. అలాగే జలగం వెంకటరావును చేర్చుకుంటే కొత్తగూడెం కేటాయించకతప్పదు. తుమ్మల, జలగం ఇద్దరూ పై రెండు నియోజకవర్గాల నుండే పోటీ చేస్తున్నారు. కాబట్టి ఆ నియోజకవర్గాల్లో టికెట్లిస్తేనే కాంగ్రెస్‌లో చేరుతామని షరతు పెడుతున్నారట.

వీళ్ళిద్దరూ బలమైన నేతలనే చెప్పాలి. వీళ్ళల్లో కూడా తుమ్మల ప్రభావం జిల్లాలో ఎక్కువగా ఉంటుంది. తుమ్మల, జలగంతోనే ఎక్కువ ఉపయోగం ఉంటుందని కాంగ్రెస్ అనుకుంటే కమ్యూనిస్టులతో పొత్తును పక్కన పెట్టేస్తుంది. లేదంటే వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఇంకేవైనా నియోజకవర్గాలను సూచిస్తుంది. అయితే ఖమ్మం జిల్లాలో సర్దుబాటు చేయటానికి వేరే నియోజకవర్గాలు కూడా లేవు. అందుకని కమ్యూనిస్టులతో పొత్తును పక్కనపెట్టేయటం ఒకటే మార్గం. అప్పుడు కమ్యూనిస్టులు మాత్రమే పొత్తు పెట్టుకుని పోటీ చేయాల్సి ఉంటుంది. మొత్తం మీద కమ్యూనిస్టులకు కాంగ్రెస్ కూడా షాకిచ్చేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అర్థ‌మవుతోంది. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాల్సిందే.

First Published:  3 Sept 2023 9:41 AM IST
Next Story