Telugu Global
Telangana

దేశంలోనే మొదటి సారి వ్యర్థాల నుంచి ఆర్గానిక్ ఎరువును తయారు చేస్తున్న సిద్దిపేట మున్సిపాలిటీ

ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు చొరవతో సిద్దిపేట మున్సిపాలిటీ 'కార్బన్‌ మాస్టర్స్' కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్ట్ పట్టణంలో వ్యర్థాలు పేరుకుపోకుండా చేయడమే కాక, మున్సిపాలిటీకి డబ్బు కూడా సంపాదించి పెడుతుంది.

దేశంలోనే మొదటి సారి వ్యర్థాల నుంచి ఆర్గానిక్ ఎరువును తయారు చేస్తున్న సిద్దిపేట మున్సిపాలిటీ
X

భారతదేశంలోనే మొట్టమొదటి సారి సిద్దిపేట మున్సిపాలిటీ 'కార్బన్ మాస్టర్స్' కంపెనీ సహకారంతో సిద్దిపేట పట్టణంలో ప్రతి రోజు వెలువడే వ్యర్థాలను శుద్ది చేసి సేంద్రియ ఎరువుగా మారుస్తున్నది. దీనిని భూసార నిపుణులు నల్ల బంగారం అని పిలుస్తారు. దీనికి కార్బొనలైట్స్‌గా నామకరణం చేసి సిద్దిపేట మున్సిపాలిటీ త్వరలో మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు చొరవతో సిద్దిపేట మున్సిపాలిటీ 'కార్బన్‌ మాస్టర్స్' కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్ట్ పట్టణంలో వ్యర్థాలు పేరుకుపోకుండా చేయడమే కాక, మున్సిపాలిటీకి డబ్బు కూడా సంపాదించి పెడుతుంది.

సిద్దిపేట మున్సిపాలిటీలో ప్రతిరోజూ 60 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వెలువడుతున్నాయి. ఇందులో 15 టన్నులు గార్డెన్ వేస్ట్, 10 టన్నులు ఆహార వ్యర్థాలు వెలువడుతున్నాయి. ఈ 25 టన్నుల వ్యర్థాలను బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేయడమే కాకుండా సేంద్రియ ఎరువును తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు.

రోజుకు 100 నుంచి 120 బస్తాల ఎరువును ఉత్పత్తి చేయాలనేది తమలక్ష‌మని, ప్రస్తుతం ప్రతి సంవత్సరం 4,000 నుండి 5,000 బస్తాల సేంద్రియ ఎరువును ఉత్పత్తి చేస్తామని కార్బన్ మాస్టర్స్ సహ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ సోమనారాయణ తెలిపారు. 40 కేజీల బస్తా ధర రూ.300 నిర్ణయించామని, తొలుత సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా విక్రయించాలని యోచిస్తున్నట్లు సోమనారాయణ తెలిపారు.

అంతే కాకుండా, ఆహార వ్యర్థాల ద్వారా ప్రతిరోజూ 200 కిలోల బయో సిఎన్‌జిని ఉత్పత్తి చేస్తున్నా. మున్సిపాలిటీ, కార్బన్ మాస్టర్స్ కంపెనీలు ఈ ప్రాజెక్టుపై ఏడాదికి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ ప్రాజెక్టు 20 మంది స్థానికులకు ఉపాధి కూడా కల్పించింది.

ఈ ప్రాజెక్టు వల్ల‌ బహుళ ఉపయోగాలున్నాయని సోమనారాయణ అన్నారు. వ్యర్థాలను సేంద్రీయ ఎరువుగా తయారుచేయవడం వల్ల కర్బన ఉద్గారాలను తగ్గించడంతో పాటు భూమిపై వ్యర్థాలు పేరుకుపోకుండా నిరోధిస్తుందని సోమనారాయణ చెప్పారు. సేంద్రియ ఎరువుల వాడకం వల్ల భూసారం ఎంతో మెరుగుపడుతుందన్నారు. సిద్దిపేట సమీపంలోని బుస్సాపూర్ డంప్ యార్డులో పురపాలక సంఘం 6 కోట్ల రూపాయలతో బయో సిఎన్‌జి కమ్ ఆర్గానిక్ ఎరువుల యూనిట్‌ను నిర్మించింది. బయో CNG ప్రాజెక్ట్ ఇప్పటికే ఉత్ప్పత్తి ప్రారంభించింది.

సిద్దిపేట మున్సిపాలిటీలో 41,332 కుటుంబాలు (1.57 లక్షల జనాభా) ఉన్నాయి. పురపాలక సంఘం 52 వాహనాలను వినియోగించి చెత్తను సేకరిస్తోంది. మంత్రి హరీశ్‌రావు త్వరలో సిద్దిపేటలో కార్బన్‌లైట్‌ సేంద్రీయ ఎరువుల బ్రాండ్‌ను ప్రారంభించనున్నారు.

First Published:  21 Feb 2023 1:33 AM GMT
Next Story