Telugu Global
Telangana

సింగరేణి ఎన్నికలకై హైకోర్టు కీలక ఆదేశాలు

హైకోర్టు సింగరేణి ఎన్నికలపై స్పష్టత ఇవ్వడంతో కేంద్ర కార్మిక సంఘం బుధవారం కీలక సమావేశం నిర్వహించనున్నది.

సింగరేణి ఎన్నికలకై హైకోర్టు కీలక ఆదేశాలు
X

సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలపై హైకోర్టు తేల్చేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చే పరిస్థితి ఉండటంతో గుర్తింపు సంఘం ఎన్నికలను వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. సింగరేణి పరిధిలోని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు కూడా ఎన్నికల నిర్వహణ కష్టంగా మారవచ్చని ప్రభుత్వానికి లేఖలు రాశారు. దీంతో గుర్తింపు సంఘం ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ సింగరేణి యాజమాన్యం గత వారం హైకోర్టులో పిటిషన్ వేసింది. సోమవారం ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి కీలక ఉత్తర్వులు జారీ చేశారు. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించాల్సిందేనని ఆదేశించారు. ఈ మేరకు యాజమాన్యం వేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

హైకోర్టు సింగరేణి ఎన్నికలపై స్పష్టత ఇవ్వడంతో కేంద్ర కార్మిక సంఘం బుధవారం కీలక సమావేశం నిర్వహించనున్నది. కార్మిక సంఘాలు, యాజమాన్యంతో చర్చించి.. ఈ రోజే షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. అక్టోబర్ 7న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుందని, 9న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇస్తారని.. 10న గుర్తులు కేటాయింపు జరుగుతుందని.. అక్టోబర్ 28న గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. అక్టోబర్ 30లోగా ఎన్నికలు పూర్తి చేయాలని గతంలోనే కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆ గడువులోపే ఎన్నికలు పూర్తి చేయనున్నారు.

సింగరేణి సంస్థలో 1990 నుంచి గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతీ రెండేళ్లకు ఒకసారి ఈ ఎన్నికలు నిర్వహిస్తారు. 2003లో దీని కాలపరిమితిని నాలుగేళ్లకు పెంచారు. 2017లో జరిగిన ఎన్నికల సమయంలో మాత్రం తిరిగి రెండేళ్లకు కుదించారు. దీని ప్రకారం 2019లో గుర్తింపు సంఘం ఎన్నికలు జరగాలి. కానీ అప్పటి నుంచి పలు కారణాలు చెప్తూ యాజమాన్యం నాలుగేళ్లుగా గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించలేదు. తాజాగా కోర్టు ఆదేశాలతో అక్టోబర్ 30లోగా ఎన్నికల ప్రక్రియను ముగించనున్నది.

First Published:  26 Sept 2023 9:32 AM IST
Next Story