Telugu Global
Telangana

తెలంగాణ కాంగ్రెస్‌.. చలో బెంగళూరు..!

తెలంగాణకు చెందిన కీలక నేతలు ఎవరు పార్టీలో చేరాలన్న డి.కె.శివకుమార్‌తో భేటీ అవుతున్నారు. కర్ణాటక ఎన్నికల్లో గెలుపు తర్వాత కాంగ్రెస్ పార్టీలో శివకుమార్‌కు ప్రాధాన్యం పెరిగింది.

తెలంగాణ కాంగ్రెస్‌.. చలో బెంగళూరు..!
X

తెలంగాణ కాంగ్రెస్‌ రాజకీయాలకు బెంగళూరు కేంద్రంగా మారింది. టీ-కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలన్నీ బెంగళూరులోనే ఫైనల్ అవుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి తుమ్మల పార్టీలో చేరిక అంశాన్ని చర్చించేందుకు బెంగళూరు వెళ్లారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కె.శివకుమార్‌తో రేవంత్ చర్చలు జరపనున్నారు. ఐతే తుమ్మల పాలేరు సీటు కోసం పట్టుబడుతున్నారు. అయితే ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఆ స్థానం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ అంశాలపై అక్కడే ఉన్న కాంగ్రెస్‌ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలుతో రేవంత్ చర్చించనున్నారు.

ఇక తెలంగాణకు చెందిన కీలక నేతలు ఎవరు పార్టీలో చేరాలన్న డి.కె.శివకుమార్‌తో భేటీ అవుతున్నారు. కర్ణాటక ఎన్నికల్లో గెలుపు తర్వాత కాంగ్రెస్ పార్టీలో శివకుమార్‌కు ప్రాధాన్యం పెరిగింది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన నిర్ణయాలన్ని ఆయన పరిధిలోనే జరుగుతున్నాయి. బీఆర్ఎస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు బెంగళూరు వెళ్లి డీకేతో చర్చలు జరిపిన తర్వాతే కాంగ్రెస్‌ గూటికి చేరారు.

ఇక వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల కూడా డి.కె.శివకుమార్‌తో రెండు సార్లు చర్చలు జరిపారు. పార్టీ విలీనం అంశంపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. శివకుమార్‌తో భేటీ తర్వాతే.. రాహుల్‌, సోనియాతో షర్మిల భేటీకి లైన్ క్లియర్ అయింది. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న రేవంత్‌ షర్మిల అంశాన్ని కూడా డికేతో చర్చిస్తారని సమాచారం. షర్మిల కూడా పాలేరు సీటు కోసం పట్టుబడుతోంది. ఇప్పుడు ముగ్గురు నేతలు ఒకే సీటు కోసం ప్రయత్నిస్తుండడంతో ఈ భేటీలో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

First Published:  1 Sept 2023 8:38 PM IST
Next Story