పథకాల అమలు, జిల్లా పర్యటనలు.. ఎన్నికల ప్రచారానికి రెడీ అవుతున్న సీఎం కేసీఆర్
మరికొన్ని రోజుల్లో శ్రావణమాసం ప్రారంభం కానున్నది. ఈ నెలను శుభప్రదంగా భావిస్తుంటారు. దీంతో అప్పటి నుంచే ఎన్నికల ప్రచారానికి తెర తీయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.
తెలంగాణలో మూడో సారి అధికారంలోకి రావాలని సీఎం కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. 9 ఏళ్లుగా రాష్ట్రంలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన పథకాలు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తాయని సీఎం కేసీఆర్ విశ్వసిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్ 2వ వారం తర్వాత ఎప్పుడైనా వెలువడే అవకాశం ఉందనే అంచనాలతో.. ప్రచార వ్యూహాలకు సీఎం కేసీఆర్ తెరతీస్తున్నారు. ఇప్పటి వరకు అమలు చేసిన పథకాలను ప్రచారం చేయడంతో పాటు.. ఇటీవల ప్రకటించిన పలు కొత్త పథకాలను పకడ్బంధీగా అమలు చేయాలని భావిస్తున్నారు.
ముహూర్తాల పట్ల సీఎం కేసీఆర్‌కు నమ్మకం ఎక్కువ. ఏ మంచి పని చేయాలన్నా తిథి, వారం, వర్జ్యం చూసుకుంటారు. మరికొన్ని రోజుల్లో శ్రావణమాసం ప్రారంభం కానున్నది. ఈ నెలను శుభప్రదంగా భావిస్తుంటారు. దీంతో అప్పటి నుంచే ఎన్నికల ప్రచారానికి తెర తీయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ప్రకటించిన పథకాలను త్వరితగతిన అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగానికి సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనలు మొదలు పెట్టిన తర్వాత ఆయా పథకాలను అధికారికంగా లాంఛ్ చేయనున్నారు. అక్కడే లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీ చేయడంతో పాటు బహిరంగ సభల్లో కూడా పాల్గొనేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ చివరి సారిగా జూన్ నెలలో ఆసిఫాబాద్ బహిరంగ సభలో పాల్గొన్నారు. జూలైలో సూర్యపేట, నల్గొండ, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలో బహిరంగ సభలు నిర్వహించాల్సి ఉన్నది. కానీ భారీ వర్షాల కారణంగా సీఎం కేసీఆర్ టూర్లు క్యాన్సిల్ అయ్యాయి. అయితే, ఎన్నికల షెడ్యూల్ వస్తే కోడ్ అమలులో ఉంటుంది. కాబట్టి అంతకు ముందుగానే తెలంగాణ వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేసి.. కొత్త పథకాల ప్రకటన, అమలుపై ప్రజలకు వివరించే అవకాశం ఉన్నది.
ఇప్పటికే పేదలకు సొంత ఇల్లు నిర్మించుకోవడానికి గృహ లక్ష్మి పథకం ద్వారా రూ.3 లక్షలు అందిస్తామని చెప్పారు. ఆ పథకానికి సంబంధించి దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నారు. దీంతో పాటు బీసీ కులవృత్తులు, ముస్లింలు, క్రిస్టియన్, ఇతర మైనార్టీలకు రూ.1 లక్ష ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. కేసీఆర్ జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు ఆయా పథకాల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో దళితబంధు రెండో విడత అమలు చేయాలని నిర్ణయించారు. స్థానిక ఎమ్మెల్యేల ద్వారా దళితబంధు లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేయనున్నారు. అలాగే డబుల్ బెడ్రూం, జీవో 58 ద్వారా ఇళ్ల పట్టాల పంపిణీపై కూడా సీఎం కేసీఆర్ ఫోకస్ చేయనున్నారు. తెలంగాణలో ఎన్నికలు ముగిసే వరకు సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన ఉండే అవకాశం లేదని.. ఆయన పూర్తిగా అసెంబ్లీ ఎన్నికల పైనే దృష్టి పెడతారని తెలుస్తున్నది.