Telugu Global
Telangana

అపురూప శిల్పాలకు ఆదరణ కరువు

ఆదివారం పోలేపల్లి పరిసరాల్లో పర్యటించి వెయ్యేళ్ల నాటి శివాలయం, చెన్నకేశవాలయం, నిలువెత్తు భైరవ, వీరగల్లు శిల్పాలు, కాకతీయుల కాలపు వినాయకుడు, కార్తికేయ, సప్తమాతల శిల్పాలు, భిన్నమైన చెన్నకేశవశిల్పం నిర్లక్ష్యంగా పడి ఉన్నాయన్నారు.

అపురూప శిల్పాలకు ఆదరణ కరువు
X

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లిలోని శిథిల ఆలయాలు, శిల్ప కళాఖండాలను కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌, సీఈవో, డా. ఈమని శివనాగిరెడ్డి అన్నారు. వారసత్వ స్థలాలు, కట్టడాలను కాపాడుకోవాలన్న అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆయన ఆదివారం పోలేపల్లి పరిసరాల్లో పర్యటించి వెయ్యేళ్ల నాటి శివాలయం, చెన్నకేశవాలయం, నిలువెత్తు భైరవ, వీరగల్లు శిల్పాలు, కాకతీయుల కాలపు వినాయకుడు, కార్తికేయ, సప్తమాతల శిల్పాలు, భిన్నమైన చెన్నకేశవశిల్పం నిర్లక్ష్యంగా పడి ఉన్నాయన్నారు.

వీరభద్రుని ఆలయం వద్ద క్రీ.శ. 1099వ సంవత్సరం, జూలై, 18వ తేదీ, సోమవారం నాటి శాసనం భూమిలో కూరుకుపోయిందని, కళ్యాణీచాళుక్య చక్రవర్తి త్రిభువనమల్ల ఆరో విక్రమాదిత్యుని సైన్యాధ్యక్షుడైన రుద్ర దండనాయకుడు, స్థానిక రుద్రేశ్వర, కేశవదేవ, ఆదిత్య దేవుల నైవేద్యానికి భూమిని దానం చేసిన వివరాలున్నాయని శివనాగిరెడ్డి తెలిపారు.

పోలేపల్లి చెన్నకేశవ, త్రికూటాలయాల చుట్టూ కంప పెరిగిందనీ, ఆలయాలు శిథిలమయ్యాయని, పోలేపల్లి గ్రామ చరిత్రకు అద్దం పడుతున్న ఈ వారసత్వ కట్టడాలను పదిలపరచి, చారిత్రక శిల్పాలు, శాసనాన్ని భద్రపరచి కాపాడుకోవాలని గ్రామస్తులకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ వీఆర్వో బిచ్చన్న గౌడ్‌, స్థపతి భీమవరపు వెంకటరెడ్డి, వేయిగండ్ల ప్రణయ్‌ శిల్పి పాల్గొన్నారని ఆయన చెప్పారు.

First Published:  7 Jan 2024 4:00 PM IST
Next Story