జీనోమ్ వ్యాలీకి మరో మణిహారం.. త్వరలో జంతు వ్యాక్సిన్ తయారీ కేంద్రం..
ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ సంస్థ జీనోమ్ వ్యాలీలో గ్రీన్ ఫీల్డ్ వ్యాక్సిన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్.
హైదరాబాద్ జీనోమ్ వ్యాలీకి మరో సరికొత్త వ్యాక్సిన్ కేంద్రం రాబోతోంది. 700 కోట్ల రూపాయల పెట్టుబడితో ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ సంస్థ, యానిమల్ వ్యాక్సిన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతోంది. పశువులకు సహజంగా వచ్చే ఫూట్ అండ్ మౌత్ డిసీజ్ వ్యాక్సిన్ ఇక్కడ తయారు కాబోతోంది. ఈ వ్యాక్సిన్ కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా 750మందికి ఉపాధి లభించే అవకాశముంది.
వ్యాక్సిన్ హబ్ ఆఫ్ ది వరల్డ్ గా ఇప్పటికే హైదరాబాద్ ప్రత్యేక గుర్తింపుని సాధించింది. కరోనా సమయంలో హైదరాబాద్ కేంద్రంగానే కోవాగ్జిన్ ప్రపంచ దేశాలకు సరఫరా అయింది. ఇప్పుడు పశువుల వ్యాక్సిన్ లో కూడా హైదరాబాద్ కు ప్రత్యేక గుర్తింపు రాబోతోంది.
ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ (IIL), జాతీయ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డ్ కి అనుబంధ సంస్థ. ఈ సంస్థకు ఫూట్ అండ్ మౌత్ డిసీజ్ (FMD) వ్యాక్సిన్ తయారీలో మంచి పేరుంది. భారత ప్రభుత్వం చేపట్టిన నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ కి IIL వ్యాక్సిన్లు సరఫరా చేస్తుంది. ఇప్పుడీ కంపెనీ హైదరాబాద్ లో గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ కి సిద్ధమైంది. అత్యాధునిక బయోసేఫ్టీ లెవల్ - 3 ప్రమాణాలకు అనుగుణంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఏడాదికి ప్రస్తుతం 30కోట్ల వ్యాక్సిన్ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఈ సంస్థ.. ఇప్పుడు మరో 30కోట్ల అదనపు డోసుల్ని తయారు చేసే సామర్థ్యాన్ని సమకూర్చుకుంది.
IIL ఎండీ డాక్టర్ కె.ఆనంద్ కుమార్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు ముకుల్ గౌర్, ఎన్ఎస్ఎన్ భార్గవ్, సంస్థ ఉన్నతాధికారులు మంత్రి కేటీఆర్ తో సమావేశమయ్యారు. కంపెనీ ప్రణాళికలపై వివరాలు అందించారు. ఈ సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, తెలంగాణ ఫార్మా, లైఫ్ సైన్సెస్ విభాగం డైరెక్టర్ నాగప్పన్ కూడా పాల్గొన్నారు.
మరో అరుదైన ఘనత..
ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ సంస్థ జీనోమ్ వ్యాలీలో గ్రీన్ ఫీల్డ్ వ్యాక్సిన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. ఇప్పటికే హైదరాబాద్ కి వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అనే పేరుందని, మానవుల వ్యాక్సిన్ ఉత్పత్తిలోనే కాకుండా, జంతువుల వ్యాక్సిన్ ఉత్పత్తికి కూడా హైదరాబాద్ కేంద్రం కావడం మరింత గర్వకారణం అని చెప్పారు.
భారత టీకా రంగంలో IIL ఓ వినూత్న ముందడుగు అని చెప్పారు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె.ఆనంద్ కుమార్. రైతులకు కూడా ఇది ఎంతో ఉపయోగకరం అని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాలకు తమ కంపెనీ టీకాలు ఎగుమతి అవుతున్నాయని చెప్పారాయన.