రేవంత్ ను కలవాలనుకుంటే చెప్పి వెళ్ళండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచన
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గట్టిగా పోరాడదామని అన్నారు. పార్టీలో అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవాలనుకుంటే సమాచారం ఇచ్చి కలవాలని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన నంది నగర్ నివాసంలో ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే పరిస్థితి లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల వరకు ఆ హామీలను ఇలాగే సాగదీసే అవకాశం ఉందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా? ఉండదా? అనే విషయం వాళ్ల చేతుల్లోనే ఉందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఓటమితో నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదని పార్టీ శ్రేణులకు సూచించారు.
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గట్టిగా పోరాడదామని అన్నారు. పార్టీలో అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెప్పారు. ఇకపై వారంలో రెండు రోజులు పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుస్తానని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతపై కేసీఆర్ పలు సూచనలు చేశారు.
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలి
ఇటీవల ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. అయితే తాము పార్టీ మారడం లేదని సదరు ఎమ్మెల్యేలు క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు కేసీఆర్ పలు సూచనలు చేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని.. అధికార పార్టీ ట్రాప్ లో పడొద్దని సూచించారు.
అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి, మంత్రులను కలిసినా తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని చెప్పారు. అభివృద్ధి పనుల కోసం మంత్రులను కలవాలనుకుంటే వారు జనం మధ్య ఉన్నప్పుడు కలిసి వినతులు ఇవ్వాలన్నారు. ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవాలనుకుంటే ముందుగా పార్టీకి సమాచారం అందించి ఆ తర్వాత కలవాలని కేసీఆర్ సూచించారు.