Telugu Global
Telangana

BRSను కొట్టాలంటే.. కాంగ్రెస్‌ చరిత్ర తిరగరాయాల్సిందే..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతంలో.. కాంగ్రెస్‌ పార్టీ 1989లో చివరగా అత్యుత్తమ ఫలితాలు సాధించింది. ఆ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ 58 స్థానాల్లో విజయం సాధించింది.

BRSను కొట్టాలంటే.. కాంగ్రెస్‌ చరిత్ర తిరగరాయాల్సిందే..!
X

తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్.. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని కాంగ్రెస్‌ వ్యూహా ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్‌ను గద్దె దించాలంటే కాంగ్రెస్‌ చరిత్ర తిరగరాయాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇందుకు పార్టీ గతంలో తెలంగాణలో సాధించిన సీట్ల వివరాలను ఉదహరిస్తున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతంలో.. కాంగ్రెస్‌ పార్టీ 1989లో చివరగా అత్యుత్తమ ఫలితాలు సాధించింది. ఆ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ 58 స్థానాల్లో విజయం సాధించింది. ఆ స‌మ‌యంలో మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకూ తెలంగాణలో కాంగ్రెస్‌కు అదే బెస్ట్ పర్ఫార్మెన్స్. తర్వాత కాంగ్రెస్‌ ఏనాడు 60 సీట్ల మార్కును దాటలేదు. అయితే ఇటీవల కర్ణాటకలో విజయం సాధించడంతో.. తెలంగాణలోనూ 70 నుంచి 80 స్థానాలు సాధిస్తామని చెప్తున్నారు కాంగ్రెస్‌ నేతలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1989, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించినప్పటికీ.. తెలంగాణలో మెజార్టీ స్థానాలు గెలుచుకోలేకపోయింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందంటే.. దానికి ప్రధాన కారణం రాయలసీమ, ఆంధ్రా ప్రాంతంలో వచ్చిన సీట్లే.

ఇక 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 226 సీట్లతో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేయగా.. ఆ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ కేవలం 6 స్థానాలకే పరిమితమైంది. ఆ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ గెలిచింది కేవలం 26 సీట్లే. ఇక 1999లో జరిగిన ఎన్నికల్లో 180 సీట్లతో తెలుగుదేశం వరుసగా రెండోసారి అధికారంలోకి రాగా.. కాంగ్రెస్‌ ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా 91 సీట్లు గెలిచింది. తెలంగాణలో 42 స్థానాలతో మెరుగైన ఫలితాలు సాధించింది.

ఇక 2004లో 185 స్థానాలతో ఉమ్మడి ఏపీలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. తెలంగాణలో 48 స్థానాలు సాధించింది. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ తెలంగాణలో 26 స్థానాల్లో విజయం సాధించింది. ఇక 2009లో 156 సీట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. తెలంగాణలో 50 స్థానాల్లో గెలుపొందింది. అంటే 2004 ఎన్నికల్లో కంటే రెండు స్థానాలు ఎక్కువే సాధించింది.

2014లో ఏపీ విభజన, తెలంగాణ ఏర్పాటుతో ఆ ఎన్నికల్లో 119 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌.. కేవలం 21 స్థానాల్లో మాత్రమే గెలిచి టీఆర్ఎస్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 19 స్థానాలకే పరిమితమైంది. 2014లో ఎన్నికల తర్వాత నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌కు ఫిరాయించినప్పటికీ.. ప్రధాన ప్రతిపక్ష హోదాను కాపాడుకోగలిగింది. అయితే 2018 ఎన్నికల తర్వాత దాదాపు 12 మందికిపైగా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరడంతో అసెంబ్లీలో కాంగ్రెస్‌ బలం 6కు తగ్గింది. దీంతో ప్రధాన ప్రతిపక్షహోదాను కూడా కోల్పోయింది.

First Published:  20 Oct 2023 6:49 PM IST
Next Story