'బీఆరెస్ పేరుపై అభ్యంతరాలుంటే తెలియజేయండి'
తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మారుస్తున్నామని, ఆ పేరు పట్ల ఎవరికైనా అభ్యంతరాలుంటే ఎన్నికల కమిషన్ కు తెలియజేయవల్సిందిగా తెలంగాణ రాష్ట్రసమితి పత్రికల్లో ప్రకటన విడుదల చేసింది.
2001 లో ఏర్పడి తన సుదీర్ఘ ఉద్యమ రాజకీయాలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించి, అనంతరం 2014లో అధికారంలోకి వచ్చి అభివృద్ది పథంలో పాలన సాగిస్తున్న తెలంగాణ రాష్ట్రసమితి (టీఆరెస్)ఇక దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నది.
ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీన తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ ఆ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారు. పార్టీ పేరును టీఆరెస్ నుండి బీఆరెస్ గా మార్చడం కోసం ఆ పార్టీ వర్గాలు చట్టపరమైన కార్యక్రమాలు పూర్తి చేస్తున్నాయి. అందులో భాగంగా ఈ రోజు వివిధ పత్రికల్లో అధ్యక్షుడి పేరుతో ప్రకటన విడుదల అయ్యింది.
తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చడానికి ప్రతిపాదిస్తున్నామని, ఈ పేరు పట్ల ఎవరికైనా అభ్యంతరాలుంటే, అందుకు సరైన కారణాలను తెలుపుతూ ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయానికి 30 రోజుల లోగా తెలియజేయాలని ఆ ప్రకటనలో కోరారు.
మరో వైపు బీఆరెస్ కోసం ఆ పార్టీ ఢిల్లీలో కార్యాలయం నిర్మాణ పనులు వేగవంతం చేసింది. ఆ నూతన కార్యాలయం ప్రారంభమయ్యే లోపు తమ కార్యకలాపాల కోసం మరో అద్దె బిల్డింగులో ప్రస్తుతం కార్యాలయం కొనసాగిస్తున్నారు.