అబద్ధపు హామీలు నమ్మి ఓట్లేస్తే..భస్మాసుర హస్తం కాటేస్తుంది
జాగో తెలంగాణ అంటూ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ అబద్ధపు వాగ్దానాలపై ధ్వజమెత్తిన కేటీఆర్
రాష్ట్రంలో రేవంత్ సర్కార్ సన్నాలకు బోనస్ పేరుతో చేసిన ప్రచారమంతా బోగస్ అని తేలిపోయింది. దీనిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. జాగో తెలంగాణ అంటూ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ అబద్ధపు వాగ్దానాలపై ధ్వజమెత్తారు. అబద్ధపు హామీలు నమ్మి ఓట్లేస్తే భస్మాసుర హస్తం కాటేస్తుందన్నారు. 420 హామీల కాంగ్రెస్ పాలనలో రైతు భరోసా రూ. 15 వేలు రాలేదని, రూ. 2 లక్షల రుణమాఫీ కాలేదని, 24 గంటల ఉచిత కరెంటు మాయమైందని విమర్శించారు. పంటల కొనుగోళ్లు చేయలేదని, వరి ధాన్యం క్విటాలకు బోనస్ రూ. 500 ఇవ్వలేదన్నారు.
'శేలు దప్పినోడు శేను వెడ్తె వడగండ్ల వానొచ్చి పోయిందని, 420 హామీల కాంగ్రెస్ పాలనలో రైతుభరోసా రూ.15 వేలు రాకపాయె , రుణమాఫీ రూ.2 లక్షలు కాకపాయె అని,24 గంటల ఉచిత కరంటు మాయమాయె, పంటల కొనుగోళ్లు చెయ్యకపాయె, వరి ధాన్యం క్వింటాలుకు బోనస్ రూ.500 ఇయ్యకపాయె,అబద్ధపు హామీలు నమ్మి ఓట్లేస్తే..భస్మాసుర హస్తం కాటేస్తుంది.. జాగో తెలంగాణ' అంటూ హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు. సన్నాలకు బోనస్.. అంతా బోగన్ అని పేపర్ క్లిప్ దానికి జత చేశారు.