Telugu Global
Telangana

టీఆరెస్ గెలిస్తే 14 నెలల్లో మునుగోడు అన్ని రంగాల్లో అభివృద్ది -కేటీఆర్

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆరెస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఆ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. వేలాదిమందితో సాగిన ఈ రోడ్ షోలో ఆయన... టీఆరెస్ గెలిస్తే 14 నెలల్లో మునుగోడు అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తామని హామీ ఇచ్చారు.

టీఆరెస్ గెలిస్తే 14 నెలల్లో మునుగోడు అన్ని రంగాల్లో అభివృద్ది -కేటీఆర్
X

మునుగోడులో టీఆరెస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఓటు వేసి గెలిపిస్తే గత మూడున్నరేళ్లలో జరగని అభివృద్ది ఈ 14 నెలల్లో చేసి చూపిస్తామని పురపాలక శాఖ మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు.

కొయ్యలగూడెం నుంచి చౌటుప్పల్ వరకు దాదాపు ఐదు కిలోమీటర్ల మేర జరిగిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ రోడ్‌షోలో వేలాది మంది టీఆర్‌ఎస్, సీపీఐ(ఎం), సీపీఐ కార్యకర్తలు జెండాలు పట్టుకుని కదిలారు.

చౌటుప్పల్‌లోని చిన్నకోడూరు చౌరస్తాలో జరిగిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని పునరుద్ఘాటించారు. మూడున్నరేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన రాజగోపాల్‌రెడ్డి వైఖరి వల్ల మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కుంటుపడిందన్నారు.

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున‌ ఎమ్మెల్యేగా గెలిచిన రాజగోపాల్ రెడ్డి మూడేళ్లుగా బీజేపీతో టచ్‌లో ఉండి కోవర్టు రాజకీయాలకు పాల్పడ్డారని, బీజేపీ ప్రభుత్వం నుంచి తన కుటుంబానికి రూ.18,000 కోట్ల కాంట్రాక్ట్ తెచ్చుకుని తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారని, దీంతో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయని గుర్తు చేశారు కేటీఆర్.

రాజగోపాల్ రెడ్డి ఓట్లను బజారులో అమ్ముకునే వస్తువులుగా భావించి ఓటర్లకు డబ్బులు పంచి ఉప ఎన్నికల్లో గెలుస్తామనే అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు, తర్వాత పరిస్థితిని ప్రజలు గుర్తు చేసుకోవాలని కోరుతూ, తెలంగాణ రాకముందు బంధువుల అంత్యక్రియలకు హాజరైన తర్వాత బోర్‌వెల్‌ల వద్ద స్నానాలు చేయాలనుకున్నప్పుడు 30 నిమిషాల పాటు విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ లైన్‌మెన్‌లను బతిమిలాడుకోవాల్సి వచ్చేదని ఆయన అన్నారు.

కానీ, ఇప్పుడు వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని, దేశంలోనే వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్‌ను అందజేస్తున్నది ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అని ఆయన అన్నారు.

నల్గొండ జిల్లా గతంలో తాగునీరు, సాగునీరు లేక‌ ఇబ్బంది పడేదని, ప్రస్తుతం వరి ఉత్పత్తిలో నల్గొండ జిల్లా అగ్రస్థానంలో ఉందని గుర్తు చేశారు. చౌటుప్పల్‌, సంస్తాన్‌ నారాయణపూర్‌, మర్రిగూడ మండలాల్లో ఫ్లోరైడ్‌ సమస్య వల్ల అక్కడి యువకులకు పిల్లనివ్వడానికి ఎవ్వరూ ఇష్టపడకపోయేవారని, కానీ, రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ కింద ఇంటింటికీ రక్షిత మంచినీటిని సరఫరా చేయడం ద్వారా ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించిందని కేటీఆర్ తెలిపారు. .

శివన్నగూడెం, కిస్త్రంపల్లి రిజర్వాయర్ల పనులు 60 నుంచి 70 శాతం పూర్తయ్యాయి. పనులు పూర్తయిన వెంటనే రిజర్వాయర్లను ముఖ్యమంత్రి స్వయంగా ప్రారంభిస్తారని కేటీఆర్ చెప్పారు.

మిషన్ భగీరథ కోసం రూ.19 వేల కోట్ల నిధులు ఇవ్వాలని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి నీతి అయోగ్ సిఫారసు చేసిందని, కానీ, ఈ పథకానికి కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వ‌లేదని ఆయన అన్నారు. అదే నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజగోపాల్ రెడ్డికి చెందిన కంపెనీకి రూ.18 వేల కోట్ల మైనింగ్ కాంట్రాక్టునుమాత్రం కట్టబెట్టిందన్నారు కేటీఆర్.

2006లో అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా మునుగోడుకు వచ్చిన సమయంలో ఫ్లోరైడ్‌ బాధితులకు సామాజిక భద్రత, ప్రాంతీయ ఫ్లోరైడ్‌ పరిశోధన, నివారణ కేంద్రం, 300 పడకల ఆసుపత్రికి హామీ ఇచ్చారని, కానీ ఆయన హామీలు నెరవేర్చలేదన్నారు. కేంద్రం నిధులు ఇచ్చిందని ప్రచారం చేస్తున్న‌ బీజేపీ నేతలను ప్రశ్నించాలని కేటీఆర్ ప్రజలను కోరారు.

మోడీ ప్రభుత్వం ఎల్‌పీజీ సిలిండర్‌ రీఫిల్లింగ్ ధర రూ.400 నుంచి రూ.1200కి పెంచింద‌ని గుర్తు చేస్తూ.. నవంబర్ 3న మహిళలు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లే ముందు గ్యాస్‌ సిలిండర్‌ను చూడాలని.. కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు.

రోడ్‌షోలో విద్యుత్ శాఖా మంత్రి జగదీశ్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కర్నె ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.


First Published:  22 Oct 2022 3:29 AM GMT
Next Story