పుంజుకుంటున్న కాంగ్రెస్.. ఉమ్మడి వరంగల్ గులాబి నేతల్లో గుబులు
సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఐప్యాక్ సంస్థ చేసిన సర్వే టీఆర్ఎస్ పార్టీలో ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తే ఈ సారి గెలవడం కష్టమే అని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.
తెలంగాణ ఇచ్చింది తామేనని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అధికారంలోకి రాలేకపోయింది. కానీ, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో అధికారం చేపట్టాలని గట్టిగా పోరాడుతోంది. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయ్యాక పలు జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడంలో విజయవంతం అవుతున్నారు. పలు జిల్లాల్లో ఉండే గ్రూపు తగాదాలను తగ్గిస్తూ.. గెలుపు కోసం పని చేయాలని ఉత్సాహపరుస్తున్నారు.
ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా రాబోయే ఎన్నికలకు అప్పుడే గ్రౌండ్ సిద్ధం చేసుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పార్టీ బలాబలాలు, ఎమ్మెల్యేల పని తీరుపై సర్వే చేయించినట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఐప్యాక్ సంస్థ చేసిన సర్వే పార్టీలో ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తే ఈ సారి గెలవడం కష్టమే అని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఒక్క ములుగు నియోజకవర్గం తప్ప మిగిలిన సీట్లన్నీ టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అయితే ఈ 11 మంది టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఏడుగురు ఎమ్మెల్యేల గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని.. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నట్లు సర్వేలో తేలింది. వీరిలో మాజీ మంత్రులు కూడా ఉన్నట్లు పేర్కొనడం పార్టీని కూడా కలవరపెడుతోంది. టీఆర్ఎస్‌కు ఎదురు గాలి వీస్తున్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకున్నట్లు కూడా నివేదిక చెప్తోంది.
కాంగ్రెస్ పార్టీ ఇటీవల వరంగల్‌లో రైతు సంఘర్షణ సభ నిర్వహించింది. ఈ బహిరంగ సభకు వచ్చిన రాహుల్ గాంధీ పలు హామీలు ఇచ్చారు. రైతులు ఆకట్టుకోవడంలో కాంగ్రెస్ సక్సెస్ అయ్యిందని ఆనాడే వ్యాఖ్యలు వినిపించాయి. ఆ సభ తర్వాత కాంగ్రెస్ పార్టీ మరింత ఉత్సాహంగా జిల్లాలో పని చేసింది. ముఖ్యంగా యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో నిరసనలు, ఆందోళనలు చేసింది. అధికార పార్టీకి ఈ విషయంలో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. బీజేపీ, టీఆర్ఎస్ వాదులాటలో కాంగ్రెస్ ముందుకు వెళ్లిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే ఎన్నికల్లో వరంగల్ జిల్లాల్లో సగం సీట్లు టీఆర్ఎస్ కోల్పోవడం ఖాయమని ఐప్యాక్ సర్వేలో పేర్కొన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆ సీట్లను కైవసం చేసుకుంటుందని కూడా తేల్చారు. ఈ నివేదికతో గులాబీ బాస్ కేసీఆర్ అప్రమత్తం అయ్యారు. మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలపై క్షేత్రస్థాయి రిపోర్ట్ తెప్పించుకోవాలని భావిస్తున్నారు. పని తీరు మార్చుకోకపోతే ఆయా స్థానాల్లో కొత్త అభ్యర్థులను నిలబెట్టాలనే ఆలోచన కూడా చేస్తున్నారు.
ఇటీవల పలు సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు చేశాయి. ఆరా సంస్థ, ఆత్మసాక్షి, ఐప్యాక్‌తో పాటు ఇంటెలిజెన్స్ కూడా సర్వే చేశారు. ఇందులో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, జనగామ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్‌ల పని తీరు బాగా లేనట్లు సమాచారం. వీరికి ఈ సారి టికెట్లు ఇస్తే ఎదురీత తప్పదని తెలుస్తోంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొదటి నుంచి టీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యనే గట్టి పోటీ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో బలపడుతుందని తెలియడంతో.. కొంత మంది టీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ఆ పార్టీవైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే టీఆర్ఎస్ నుంచి భారీ వలసలు ఉంటాయని కాంగ్రెస్ జిల్లా నాయకులు చెప్తున్నారు. ఇప్పటికే కొంత మంది రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాకూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
టీఆర్ఎస్ నుంచి అసంతృప్తులు బీజేపీ వైపు వెళ్లకుండా.. కాంగ్రెస్‌లోకి తీసుకొని వచ్చే బాధ్యతను రాజకీయ వ్యూహకర్త సునీల్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయనే కొంత మందితో చర్చలు జరుపుతున్నట్లు కూడా సమాచారం. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలని భావిస్తోంది. జిల్లాలో ఇలా కాంగ్రెస్ బలపడటం టీఆర్ఎస్ అధినాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తోందని.. అదే సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు టికెట్లు రావేమోననే గుబులుతో ఉన్నట్లు సమాచారం.