శాంతి లేకపోతే ప్రపంచమే అస్తవ్యస్తమవుతుంది
క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో మాజీ మంత్రి హరీశ్ రావు
శాంతి లేకపోతే ప్రపంచమే అస్తవ్యస్తమవుతుందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. మంగళవారం సికింద్రాబాద్ సీఎస్‌ఐ వెస్లీ చర్చిలో గాడ్ విజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. కొన్ని శక్తులు మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాయని.. మతం కన్నా మానవత్వం గొప్పదని అన్నారు. ఉన్నత విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించడమే మన అందరి బాధ్యత అన్నారు. ఏసుప్రభువు మాటలు, సూక్తులు వినడంతో పాటు ఆచరించి సమాజంలో మంచిని పెంపొందించాలని కోరుతున్నానని అన్నారు. రెండు వేల ఏళ్ల క్రితం జన్మించిన క్రీస్తును ఇప్పటికీ ప్రార్థిస్తున్నారంటే ఆయన గొప్పతనం ఏమిటో తెలిసి పోతుందన్నారు. ప్రేమ, దయ, గుణం, కరుణ, శాంతిని అందరిలో ఏసుక్రీస్తు పెంపొందించారని అన్నారు. ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది జరుపుకునేది క్రిస్మస్ పండుగ అన్నారు. క్రిస్మస్ వేడుకలు అధికారికంగా నిర్వహించిన ఒకే ఒక్క సీఎం కేసీఆర్ అన్నారు. ఆయన అన్నిమతాలను సమానంగా చూశారని తెలిపారు.